Coconut | పూజలు లేదా ఇతర శుభ కార్యాలు జరిగినప్పుడు హిందువులు కొబ్బరికాయలను కొడుతుంటారు. ఆ తరువాత వాటిని నైవేద్యంగా పెట్టి తమ కోరికలను నెరవేర్చమని కోరుకుంటారు. అలాగే చాలా మంది ఇలాంటి కార్యక్రమాలకు కొబ్బరికాయలను ఉపయోగించకపోయినా తరచూ వంటల్లో మాత్రం కొబ్బరిని వేస్తుంటారు. కొందరు పచ్చి కొబ్బరిని వంటల్లో వేస్తే కొందరు ఎండు కొబ్బరిని వేస్తారు. కొబ్బరి వేస్తే వంటలకు మంచి రుచి, వాసన వస్తాయి. అయితే ఆరోగ్యపరంగా కొబ్బరి మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. కొబ్బరిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కొబ్బరి ఔషధంగా పనిచేస్తుంది. రోజూ ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కను కాస్త బెల్లంతో కలిపి రాత్రి పూట భోజనం చేసిన అనంతరం తింటుండాలి. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. మలబద్దకం తగ్గుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. కొబ్బరిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. రోజూ కొబ్బరిని తినలేకపోతే రాత్రి పూట నిద్రకు ముందు ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను సేవించవచ్చు. ఇది కూడా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
విరేచనాలు అయినప్పుడు కొబ్బరిని తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పచ్చి కొబ్బరిలో ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేలా చూస్తుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. పచ్చి కొబ్బరిని వేసవిలో తింటే శరీరం చల్లగా ఉంటుంది. శరీరంలోని వేడి పోతుంది. కొబ్బరి మన శరీరానికి చలువ చేస్తుంది. కాబట్టి పచ్చి కొబ్బరిని వేసవిలో తినాలి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండ దెబ్బ నుంచి సురక్షితంగా ఉండవచ్చు.
వేసవిలో చెమట కాయలు అధికంగా అవుతుంటాయి. అలాగే కొందరికి విపరీతంగా చెమట వచ్చి శరీరం దుర్వాసనగా ఉంటుంది. అలాంటి వారు కొబ్బరిని తింటుంటే ఫలితం ఉంటుంది. లేదా కొబ్బరి నీళ్లను కాస్త నీటిలో వేసి కలిపి ఆ నీటితో స్నానం చేస్తున్నా సమస్యలు తగ్గుతాయి. పొట్టలో నులి పురుగుల సమస్య ఉన్నవారు రోజూ కొబ్బరిని తింటుంటే ఫలితం ఉంటుంది. జీర్ణాశయం శుభ్రంగా ఉంటుంది. మూత్రాశయ సమస్యలు ఉన్నవారు రోజూ కొబ్బరిని తింటున్నా లేదా కొబ్బరి నీళ్లను తాగుతున్నా ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. కొబ్బరిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పంగల్, యాంటీ వైరల్ గుణాలు మూత్రాశయ ఇన్ఫెక్షన్లకు కారణం అయ్యే క్రిములను నిర్మూలిస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. ఇలా కొబ్బరిని రోజూ తింటే అనేక లాభాలను పొందవచ్చు.