Cinnamon Milk | దాల్చిన చెక్కను మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. బిర్యానీ, పులావ్ వంటి వంటకాలతోపాటు మసాలా వంటల్లో దాల్చిన చెక్కను వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. దాల్చిన చెక్క ఘాటుగా ఉంటుంది. కనుక వంటల్లో వేస్తే కాస్త కారంగా అనిపిస్తుంది. అందుకని దాల్చిన చెక్కను కేవలం వంటల్లోనే వేస్తుంటారు. నేరుగా తినరు. అయితే దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దాల్చిన చెక్కను తీసుకుంటే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కానీ ఘాటుగా ఉంటుంది కాబట్టి దీన్ని నేరుగా తినలేరు. అయితే రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కాస్త దాల్చిన చెక్క పొడిని కలిపి తాగవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
దాల్చిన చెక్క పాలను తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే సమస్య ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్క పాలను తాగుతుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దాల్చిన చెక్క వల్ల శరీరం ఇన్సులిన్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. రాత్రి పూట దాల్చిన చెక్క పాలను సేవిస్తుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు.
దాల్చిన చెక్క పాలను సేవిస్తే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. పాలలో, దాల్చిన చెక్కలో ఉండే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. దీంతో సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్లు సైతం తగ్గుతాయి. పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కనుక దాల్చిన చెక్క పొడి కలిపిన పాలను తాగుతుంటే శరీరానికి క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
దాల్చిన చెక్క పాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు ఈ పాలను రోజూ సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. అయితే కొవ్వు తీసిన పాలను తాగాల్సి ఉంటుంది. దాల్చిన చెక్క పాలలో సినమాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కనుక శరీరం లోపల, బయట ఉండే వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి బయట పడవచ్చు. ఇలా దాల్చిన చెక్క పాలను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే గర్భిణీలు, అలర్జీలు ఉన్నవారు, రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు, లివర్ సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ పాలను తాగకూడదు.