Bottle Gourd | ఆనపకాయలు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే కూరగాయల్లో ఒకటి. వీటినే కొందరు సొరకాయలు అని కూడా పిలుస్తారు. సాధారణంగా వీటిని తినేందుకు చాలా మంది అంతగా ఇష్టపడరు. కానీ వీటితో పచ్చడి, టమాటా కర్రీ చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. చారు, సాంబార్ వంటి వాటిల్లోనూ వీటిని వేస్తుంటారు. ఇక ఉత్తరాది వారు ఆనపకాయలతో ఎక్కువగా పాయసం చేస్తుంటారు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఆనపకాయలు మనకు అనేక పోషకాలను అందిస్తాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఆనపకాయలతో జ్యూస్ తయారు చేసి రోజూ ఉదయం పరగడుపునే ఒక గ్లాస్ మోతాదులో తాగుతుంటే అనేక లాభాలు కలుగుతాయి. ఆనపకాయలు అనేక వ్యాధుల నుంచి మనల్ని బయట పడేలా చేస్తాయి. కనుక వీటిని రోజూ తీసుకోవాలి.
ఆనపకాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో 92 శాతం వరకు నీరే ఉంటుంది. అందువల్ల ఇవి శరీరానికి కావల్సిన ద్రవాలను అందజేస్తాయి. చర్మం తేమగా మారుతుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ సైతం సమతుల్యంలో ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం ఆనపకాయ మనకు చలువ చేస్తుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. కనుక దీన్ని తింటే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. శరీరంలో ఎల్లప్పుడూ వేడి అధికంగా ఉన్నవారు వీటిని తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఆనపకాయలను తినడం వల్ల ఆయుర్వేద ప్రకారం శరీరంలో ఉండే పిత్త దోషం తొలగిపోతుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ఆనపకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు తరచూ ఆనపకాయలను తింటున్నా లేదా ఈ కాయలకు చెందిన జ్యూస్‌ను రోజూ తాగుతున్నా ఎంతగానో ఫలితం ఉంటుంది. దీని వల్ల కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కాయల్లో ఉండే నీరు వల్ల పొట్టలోని మంట తగ్గిపోతుంది. అలాగే జీర్ణాశయ లోపలి పొర సంరక్షించబడుతుంది. దీంతో అల్సర్లు నయమవుతాయి. అలాగే గ్యాస్ కారణంగా వచ్చే గుండెల్లో మంట సైతం తగ్గుతుంది. ఆనపకాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని ద్రవాలను నియంత్రిస్తుంది. సోడియం స్థాయిలు తగ్గేలా చేస్తుంది. దీని వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు.
ఆనపకాయల జ్యూస్‌ను రోజూ తాగితే శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఈ కాయలకు చెందిన జ్యూస్‌ను రోజూ తాగుతుంటే ఫైబర్ అధికంగా లభించి కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. కనుక బరువు తగ్గాలని చూస్తున్న వారు రోజూ ఈ కాయలకు చెందిన జ్యూస్‌ను తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఆనపకాయల్లో కోలిన్ అధికంగా ఉంటుంది. ఇది నాడీ మండల వ్యవస్థను ప్రశాంతంగా మారుస్తుంది. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. ఇలా ఆనపకాయలను తరచూ తింటున్నా లేదా వాటి జ్యూస్‌ను రోజూ తాగుతున్నా ఎన్నో లాభాలను పొందవచ్చు.