Black Tea | రోజూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు చాలా మంది టీ, కాఫీలను అదే పనిగా సేవిస్తుంటారు. ఇక కొందరు టీ ప్రియులు అయితే రాత్రి పూట కూడా టీ సేవిస్తారు. టీని ఇలా అతిగా సేవించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ టీకి బదులుగా బ్లాక్ టీని ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వారు అంటున్నారు. అయితే ఆరోగ్యకరమే అయినప్పటికీ బ్లాక్ టీని కూడా మోతాదులోనే తాగాలని వారు సూచిస్తున్నారు. బ్లాక్ టీ అంటే కేవలం టీ డికాషన్ మాత్రమే. రుచి కోసం అందులో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు. అప్పుడు అది లెమన్ టీ అవుతుంది. ఈ విధంగా రెండు రకాలుగా బ్లాక్ టీని సేవించవచ్చు. బ్లాక్ టీని రోజూ కనీసం 2 కప్పులు తాగితే అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ టీని సేవించడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. బీపీ పేషెంట్లు బ్లాక్ టీని సేవిస్తుంటే ఎంతో మేలు జరుగుతుంది. రోజూ కనీసం 2 కప్పుల బ్లాక్ టీని సేవిస్తే బీపీ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడిస్తున్నారు. బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. చాలా మంది ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు రోజూ సాయంత్రం బ్లాక్ టీని సేవించాలి. దీని వల్ల ఆయా సమస్యలు తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభించి రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
బ్లాక్ టీని తరచూ సేవిస్తుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయని సైంటిస్టులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఈ మరకు ఫ్రీలాన్స్ డైటిషియన్ డాక్టర్ క్యారీ రక్స్టన్ మాట్లాడుతూ గ్రీన్ టీ కన్నా బ్లాక్ టీని సేవించడం వల్లే స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. క్యాన్సర్, డయాబెటిస్, నోటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చని తెలిపారు. బ్లాక్ టీని తరచూ సేవిస్తుంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. తరచూ ఈ సమస్యలు వచ్చే వారు రోజూ బ్లాక్ టీని సేవిస్తుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు బ్లాక్ టీని సేవిస్తుంటే ఆయా ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు.
బ్లాక్ టీని సేవిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని సైంటిస్టులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆహార నాళం, జీర్ణాశయం, పేగుల క్యాన్సర్ రాకుండా చూసే గుణాలు బ్లాక్ టీలో ఉంటాయని చెబుతున్నారు. బ్లాక్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్)ను పెంచుతాయి. దీని వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఇది గుండె పోటు రాకుండా నివారిస్తుంది. బ్లాక్ టీని సేవిస్తే దంతాలపై ఎనామిల్ కూడా దృఢంగా మారుతుంది. దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా ఉంటాయి. బ్లాక్ టీలో ఉండే పాలిఫినాల్స్ నోట్లో ఉండే బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలా బ్లాక్ టీని రోజూ తాగడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాను పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.