Black Rice | ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక శాతం మందికి బియ్యం ప్రధాన ఆహారంగా ఉంది. మన దేశంలో ఉత్తరాది కన్నా దక్షిణాది వారు బియ్యాన్ని ఎక్కువగా తింటుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే బ్రౌన్ రైస్‌ను తినాలని చెబుతుంటారు. ఇది మాత్రమే కాదు, రైస్‌లోనూ ఇంకా చాలా వెరైటీలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బ్లాక్ రైస్ కూడా ఒకటి. ఇది ముదురు ఊదా రంగులో ఉంటుంది. కనుకనే నలుపు రంగులో ఉన్నట్లు మనకు దర్శనమిస్తుంది. అయితే ఈ రైస్‌లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. బ్లాక్ రైస్‌ను చైనీయులు ఎక్కువగా తింటారు. దీన్ని తింటే అనేక పోషకాలు లభిస్తాయి. అలాగే పలు వ్యాధుల నుంచి బయట పడవచ్చు. బ్లాక్ రైస్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
100 గ్రాముల ఉడకబెట్టిన బ్లాక్ రైస్‌ను తింటే మనకు సుమారుగా 170 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ రైస్‌లో సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. అలాగే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ప్రోటీన్లు, కొవ్వు తక్కువగా, విటమిన్ ఇ, బి విటమిన్లు, ఐరన్, జింక్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, కాపర్, క్రోమియం, సెలీనియం అధికంగా ఉంటాయి. బ్లాక్ రైస్‌లో ఆంథో సయనిన్స్, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలిఫినాల్స్, ఫెరులిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల జరిగే నష్టం నివారించబడుతుంది. బ్లాక్ రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీని వల్ల అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
బ్లాక్ రైస్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి కనుక శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. తరచూ బ్లాక్ రైస్‌ను తింటుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బ్లాక్ రైస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. ప్రీబయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది కనుక జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
బ్లాక్ రైస్ చాలా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువను కలిగి ఉంటుంది. అందువల్ల ఈ రైస్‌ను తింటే షుగర్ లెవల్స్ త్వరగా పెరగవు. పైగా ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అందువల్ల షుగర్ ఉన్నవారు సైతం బ్లాక్ రైస్‌ను ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. ఈ రైస్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే చాలా తక్కువ తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉంటారు. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. బ్లాక్ రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇలా బ్లాక్ రైస్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.