Ash Gourd Juice | బూడిద గుమ్మడికాయలను సహజంగానే చాలా మంది దిష్టి తీసేందుకు లేదా దిష్టి తగలకుండా ఉండేందుకు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కడుతుంటారు. బూడిద గుమ్మడికాయ అంటే చాలా మందికి దిష్టి తీయడమే ముందుగా గుర్తుకు వస్తుంది. కానీ ఆయుర్వేద ప్రకారం చూస్తే బూడిద గుమ్మడికాయ మనకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. బూడిద గుమ్మడికాయలతో కొందరు కూరలు చేసుకుని తింటారు. ఇంకా కొందరు తీపి పదార్థాలను కూడా తయారు చేస్తుంటారు. అయితే బూడిద గుమ్మడికాయలను తినడం ఇష్టం లేని వారు దీంతో జ్యూస్ తయారు చేసి కూడా రోజూ తాగవచ్చు. బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ జ్యూస్ ఎన్నో వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని రోజూ తప్పనిసరిగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బూడిద గుమ్మడియ జ్యూస్‌ను తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. బూడిద గుమ్మడికాయ జ్యూస్‌లో నీరు అధిక మొత్తంలో ఉంటుంది. అందువల్ల ఈ జ్యూస్‌ను సేవిస్తే జీర్ణాశయంలో ద్రవాల సమతుల్యత పెరుగుతుంది. పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ జ్యూస్‌లో ఆల్కలైన్ గుణాలు ఉంటాయి. దీని వల్ల జీర్ణాశయంలో ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అవకుండా అడ్డుకోవచ్చు. దీంతో అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అల్సర్లు తగ్గిపోతాయి. ఈ జ్యూస్ జీర్ణాశయంపై చల్లని ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వల్ల జీర్ణాశయం గోడలు ఆరోగ్యంగా ఉంటాయి. కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
బూడిద గుమ్మడికాయ జ్యూస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ జ్యూస్‌ను సేవిస్తుంటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో తీసుకునే ఆహారంపై నియంత్రణ ఉంటుంది. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఈ జ్యూస్‌ను తాగుతుంటే శరీర మెటబాలిజం సైతం పెరుగుతుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్‌లో నీరు అధికంగా ఉండడం వల్ల దీన్ని తాగితే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. శరీరం సహజసిద్ధంగా డిటాక్స్ అవుతుంది.
బూడిద గుమ్మడికాయల్లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన తగ్గేందుకు దోహదపడతాయి. మైండ్ రిలాక్స్ అయ్యేలా చూస్తాయి. తరచూ ఈ జ్యూస్‌ను తాగుతుండడం వల్ల మూడ్ మంచిగా మారుతుంది. హ్యాప్పీగా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతాయి. బూడిద గుమ్మడికాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే ఈ జ్యూస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయల్లో ఉండే హైడ్రేటింగ్ గుణాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. చర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయి. ఇలా బూడిద గుమ్మడికాయలతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటి జ్యూస్‌ను రోజూ తాగడం మరిచిపోకండి.