Amaranth Seeds | ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆహారం విషయంలో అనేక మార్పులు చేసుకుంటున్నారు. పోషకాలు కలిగిన ఆహారాలను తింటున్నారు. అయితే వాస్తవానికి మనం తింటున్న పోషకాహారాలు కొన్నే. ఇంకా మనకు తెలియని ఎన్నో పోషకాహారాలు ఉన్నాయి. వాటిల్లో తోటకూర గింజలు కూడా ఒకటి. వీటినే అమరాంథ్ గింజలు లేదా రాజ్ గిరా విత్తనాలు అని కూడా పిలుస్తారు. ఈ గింజల గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. తరచూ ఈ గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. మధ్య, దక్షిణ అమెరికాలలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ గింజలను ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఇవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అనేక పోషకాలను అందిస్తాయి. పలు వ్యాధులు నయం అయ్యేలా చేస్తాయి. ఈ గింజలను రోజూ తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
తోటకూర గింజలను తరచూ తినడం వల్ల వృక్ష సంబంధమైన ప్రోటీన్లు లభిస్తాయి. నాన్ వెజ్ తినలేని వారు ఈ గింజలను తింటే ప్రోటీన్లను పొందవచ్చు. ఈ గింజల్లో అనేక రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. లైసీన్ అనే అమైనో యాసిడ్ ఈ గింజల్లో అధికంగా ఉంటుంది. ఇది కండరాలకు శక్తిని అందిస్తుంది. కండరాలు నిర్మాణం అయ్యేలా చేస్తుంది. దీంతో నీరసం, అలసట తగ్గుతాయి. శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. బద్దకం పోతుంది. శాకాహారులకు కావల్సిన ప్రోటీన్లను ఈ గింజల ద్వారా పొందవచ్చు. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. ఈ గింజలను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. కనుక తోటకూర గింజలను రోజూ తింటుంటే బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు.
ఈ గింజల్లో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేసేలా చేస్తుంది. దీంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. చురుగ్గా ఆలోచిస్తారు. అలాగే శరీర మెటబాలిజం కూడా మెరుగు పడుతుంది. ఈ గింజల్లో ఉండే మెగ్నిషియం శరీరంలో నాడుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గేలా చేస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోయే సమస్య ఉన్నవారు ఈ గింజలను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. తోటకూర గింజల్లో ఫాస్ఫరస్ సైతం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ గింజల్లో అధికంగా ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
తోటకూర గింజల్లో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు ఈ గింజలను రోజూ తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు కూడా ఈ గింజలను తినవచ్చు. దీంతో ఎలాంటి అలర్జీలు రావు. ఈ గింజల్లో ఫినోలిక్ సమ్మేళనాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వల్ల శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ గింజలను తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా తోటకూర గింజలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.