Almond Tea | రోజూ ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు చాలా మంది టీ, కాఫీలను సేవిస్తుంటారు. టీ, కాఫీలను తాగడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. శరీరం ఉత్తేజంగా మారుతుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. తల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే టీ, కాఫీలను అతిగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకు బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలను తాగాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో బాదం టీ కూడా ఒకటి. బాదం పాలతో లేదా బాదం పొడితో బాదం టీని తయారు చేస్తారు. ఇది రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా బయట కాకుండా ఇంట్లో బాదం టీని తయారు చేసి తాగితే దాంతో అనేక లాభాలను పొందవచ్చు. బాదంపప్పును పోషకాలకు గనిగా చెబుతారు. అందువల్ల బాదం టీ ని తయారు చేసి తాగితే రుచికి రుచి, పోషకాలకు పోషకాలను పొందవచ్చు.
బాదంపప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విటమిన్ ఇ శరీర రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జ్వరం నుంచి కూడా త్వరగా కోలుకుంటారు. క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి విటమిన్ ఇ కి ఉంటుంది. ఇది చర్మాన్ని సైతం సంరక్షిస్తుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలను తొలగిస్తుంది. దీంతో చర్మం మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు.
బాదంపప్పులో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా మారుతారు. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోయే వారు బాదం టీని తాగుతుంటే ఫలితం ఉంటుంది. ఈ టీని చక్కెర లేకుండా సేవిస్తే షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. బాదంపప్పులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పప్పులో పాలీ ఆన్శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో ఉండే కొవ్వును కరిగిస్తాయి. దీంతో గుండె పోటు రాకుండా నివారించవచ్చు.
ఈ టీని తాగితే ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది. కొందరు భోజనం చేసిన తరువాత టీ తాగుతుంటారు. అది తాగితే అసిడిటీ వస్తుంది. కానీ బాదం టీని సేవిస్తుంటే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్ సమస్య తగ్గుతుంది. అజీర్తి నుంచి బయట పడవచ్చు. ఈ టీలో క్యాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. బాదం టీలో అనేక బి విటమిన్లు ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. మెదడు యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. కనుక మీరు రోజూ తాగే టీ, కాఫీలకు బదులుగా బాదం టీని తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.