Sprouted Peanuts | పల్లీలను మనం తరచూ తింటూనే ఉంటాం. వీటితో అనేక రకాల వంటకాలను తయారు చేస్తుంటారు. కొందరు పల్లీలతో చేసే తీపి వంటకాలను ఇష్టపడతారు. ఇంకొందరు వీటితో తయారు చేసే కారం వంటకాలను ఇష్టపడతారు. పల్లీలను మసాలా కూరల్లోనూ వేస్తుంటారు. వీటితో చట్నీలను తయారు చేస్తారు. అయితే పల్లీలను ఇలా తినడం కన్నా రోజూ నీటిలో నానబెట్టి వాటిని మొలకెత్తించి తినడం ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. పల్లీలను మొలకెత్తించి తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు. సాధారణ పల్లీల కన్నా మొలకెత్తిన పల్లీల్లో పోషకాల శాతం అధికంగా పెరుగుతుంది. అందువల్ల మొలకెత్తిన పల్లీలను తింటుంటే రెట్టింపు మొత్తంలో పోషకాలను పొందవచ్చు. పైగా అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పలు వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
సాధారణ పల్లీల్లో ఉండే పలు రకాల ఎంజైమ్‌లు పల్లీలు మొలకెత్తగానే పోషకాలుగా మారుతాయి. కనుక మొలకెత్తిన పల్లీలను తింటే మేలు జరుగుతుంది. మొలకెత్తిన పల్లీల్లో ఉండే పోషకాలను శరీరం కూడా సులభంగా శోషించుకుంటుంది. దీంతో శరీరానికి పోషణ లభిస్తుంది. పోషకాహార లోపం తగ్గుతుంది. మొలకెత్తిన పల్లీల్లో పలు రకాల బి విటమిన్లు, విటమిన్ ఇ అధిక మొత్తంలో ఉంటాయి. పల్లీలను మొలకెత్తించడం వల్ల వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల శాతం పెరుగుతుంది. పల్లీల్లో రెస్వెరెట్రాల్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. పల్లీలను మొలకెత్తిస్తే దీని శాతం పెరుగుతుంది. ఇది వయస్సు మీద పడకుండా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. దీంతో ముఖంపై, చర్మంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. అలాగే రెస్వెరెట్రాల్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను సైతం కలిగి ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తుంది.
మొలకెత్తిన పల్లీల్లో ఫైటిక్ యాసిడ్ అధిక మొత్తంలో ఉంటుంది. దీని వల్ల మనం తినే ఆహారాల్లో ఉండే మినరల్స్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఐరన్, జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు మనకు అధికంగా లభిస్తాయి. మొలకెత్తిన పల్లీల్లో ఫైబర్ అధిక మొత్తంలో ఉండడం వల్ల ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ పల్లీల్లో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. ఈ పల్లీలను తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు.
మొలకెత్తిన పల్లీల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. నాన్ వెజ్ తినని వారికి ఇవి అత్యుత్తమ ప్రోటీన్లను అందిస్తాయి. ప్రోటీన్ల వల్ల కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కణజాలం మరమ్మత్తులకు గురవుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. ఈ ప్రోటీన్లు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో అతి ఆకలి తగ్గుతుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. సాయంత్రం సమయంలో చిరుతిళ్లను తినే బదులు మొలకెత్తిన పల్లీలను తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పొందవచ్చు. మొలకెత్తిన పల్లీలను తింటే వాటిల్లో ఉండే ఫైబర్ కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇలా మొలకెత్తిన పల్లీలను తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.