కొంతమంది రక్తాన్ని చూడగానే తల తిరిగి పడిపోతారు. ఇలా భావోద్వేగాల కారణంగా మూర్ఛపోయే వారికి తాడాసనం ఆశాకిరణమని చెబుతున్నారు పరిశోధకులు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు తీవ్ర భావోద్వేగానికి లోనవుతారు కొందరు. ఈ హఠాత్ పరిణామం వల్ల మెదడుకు, గుండెకు తగినంత రక్తం సరఫరా కాదు. దాంతో సొమ్మసిల్లి పడిపోతారు. దీన్నే వైద్య భాషలో వేసోవేగల్ సికపీ (వీవీఎస్) అంటారు. ఇలాంటివారికి తాడాసనం ఎలా ఉపశమనం కలిగిస్తుంది? అన్నదానిపై హైదరాబాద్కు చెందిన కొందరు వైద్యులు అధ్యయనం చేశారు. ఇందుకోసం 113 మంది వీవీఎస్ రోగులను ఎంచుకున్నారు.
ఈ అధ్యయన ఫలితం ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ: ఎలక్ట్రికల్ ఫిజియాలజీ’లో ప్రచురితమైంది. ఇందులో పాల్గొన్న రోగుల గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదు. కానీ, తరచూ వీవీఎస్కు లోనయ్యేవారు. శరీరానికి తగినన్ని నీళ్లు అందేలా జాగ్రత్త పడుతూ.. వారితో రోజుకు రెండుసార్లు 8 నుంచి 12 క్రమాలు తాడాసనం వేయించారు నిపుణులు. ఆ సమయంలో శ్వాస మీద దృష్టిసారిస్తూ.. రిలాక్స్డ్గా ఉండాలని సూచించారు. తాడాసనం గుండెకు రక్తం చేరుకునే క్రమాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్లే వీవీఎస్ రోగుల మానసిక స్థితిలో సానుకూల మార్పులు
కనిపించాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.