Sun Flower Seeds | మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడం ఎంత అవసరమో అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం కూడా అంతే అవసరం. పోషకాలు అన్నీ ఉండే ఆహారాల విషయానికి వస్తే వాటిల్లో పొద్దు తిరుగుడు విత్తనాలు కూడా ఉంటాయి. వీటిని పోషకాలకు గనిగా చెబుతారు. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. లేదా పలు ఆహారాలతో కలిపి కూడా తినవచ్చు. పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా అన్ శాచురేటెడ్ కొవ్వులు, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరుకు, కణాల ఎదుగుదలకు తోడ్పడుతాయి. పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తగిన మోతాదులో తింటుంటే శరీరంలో వాపులు సైతం తగ్గుతాయి. పొద్దు తిరుగుడు విత్తనాల్లో వృక్ష సంబంధిత ప్రోటీన్లు ఉంటాయి. ఇవి నాన్ వెజ్ తినలేని వారికి ప్రోటీన్లను అందిస్తాయి. అందువల్ల పొద్దు తిరుగుడు విత్తనాలను సూపర్‌ఫుడ్‌గా చెబుతారు. ఈ విత్తనాలను తినడం వల్ల ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాలను మరమ్మత్తు చేస్తాయి. కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి. అన్ని విధాలుగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
పొద్దు తిరుగుడు విత్తనాల్లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నిషియం, సెలీనియం ఉంటాయి. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా పనిచేస్తుంది. ఇది కణాలను డ్యామేజ్ అవకుండా రక్షిస్తుంది. మెగ్నిషియం, సెలీనియం వల్ల కండరాల పనితీరు మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఫైటో స్టెరాల్స్ ఉంటాయి. ఈ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక ఈ విత్తనాలను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.
పొద్దు తిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ, జింక్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఈ విత్తనాల్లోని విటమిన్ ఇ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విత్తనాల్లో ఉండే జింక్, సెలీనియం రోగ నిరోధక వ్యవస్థ కణాలను అభివృద్ధి చేస్తాయి. దీంతో అవి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీని వల్ల మనకు రోగాలు రాకుండా ఉంటాయి. పొద్దు తిరుగుడు విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. దీంతో చర్మం మృదువుగా మారి తేమగా ఉంటుంది. చలికాలంలో చర్మం పగలకుండా చూసుకోవచ్చు. ఈ విత్తనాల్లోని విటమిన్ ఇ చర్మాన్ని రక్షిస్తుంది. సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని రక్షించి చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇలా పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక సాయంత్రం సమయంలో చిరుతిళ్లకు బదులుగా ఈ విత్తనాలను తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.