Suicides Prevention | చిన్న చిన్న విషయాలకు ఇవాళ ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. పనికిరాని అంశాల కోసం నిండు జీవితాన్ని ముగిస్తున్నారు. ఇంట్లో రిమోట్ ఇవ్వలేదని.. అనుకున్నట్లుగా మార్కులు రాలేదని, చదువుకోమని తల్లి మందలించిందని, లవ్ ఎఫైర్ కాస్తా ఎదురుతిరిగిందని.. ఇలా ఏదో ఒక కారణంగా నిత్యం ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలిసీ.. దాని గురించి ఆలోచించకుండా క్షణికావేశంలో ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇవాళ ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం సందర్భంగా ఆత్మహత్యలను నివారించేందుకు నడుం బిగిద్దాం.
ఆత్మహత్యల వంటి బాధాకరమైన నిర్ణయం తీసుకుని, తమ జీవితానికి ముగింపు కోరుతున్న వారిలో ఎక్కువ మంది యువకులు, వృద్ధులు ఉన్నారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యల ఒత్తిళ్లతో పరిణితితో మెలగాల్సిన వృద్ధులు.. తీరని అభద్రతకు గురవుతుండగా.. ఎంతో భవిష్యత్ కలిగిన యువత, అపార ఒత్తిడికి చిత్తయ్యేలా నిరర్ధక చదువుల తీరుతెన్నులు నిర్ఘాంత పరుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాల్లో చనిపోయే వారి కంటే ఆత్మహత్యల వల్ల మృతిచెందుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం విచారకరం.
నివారిద్దాం ఇలా..
ఆలోచన ఎక్కడైతే అంతమవుతుందో.. అక్కడే ఆవేశం మొదలవుతుంది. మద్యానికి బానిసగా మారడం, కుటుంబ పోషణ పట్టించుకోకపోవడం వంటి విపరీత ధోరణులు కనిపిస్తుంటాయి. ఆత్మహత్యల నివారణకు మూలలను అన్వేషించాలి. ఆత్మహత్య ఆలోచన రావడమే తరువాయి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిని మనవైపు మళ్లించవచ్చు. వారి బాధలను అర్థం చేసుకోవాలి. వారి సమస్యలను ప్రేమగా వినాలి. వారి సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో వారితోనే చెప్పించాలి. ఇలాంటివారిని గుర్తించగానే ఒంటరిగా ఉంచకుండా నలుగురితో కలిసేలా చూడాలి. నవ్వుతూ నవ్విస్తూ ఉండేలా చూడాలి. మైండ్లో నుంచి చెడు ఆలోచన బయటకు వెళ్లిపోయేలా కుటుంబసభ్యులంతా స్నేహంగా మెలగాలి. వారిలో స్ఫూర్తిని నింపేలా సినిమాలు చూపాలి. వారు సాధారణ జీవితం గడిపేంత వరకు వారిని కనిపెడ్తూ ఉండాలి. జీవితంపై అవగాహన కలిగించి ఆశలు పెంచాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మానసిక వైద్యులను కలిసి చికిత్స ఇప్పించాలి. నిరాశ, నిస్పృహల్లో ఉన్న వారికి స్వాంతన కలిగించడం ద్వారా ఆత్మహత్యలను తగ్గించవచ్చు.
చివరగా.. జీవితం జీవించడానికి కానీ.. ఆత్మహత్యలు చేసుకుని అయినవారికి మానసిక క్షోభ కలిగించేందుకు కాదని అందరూ గుర్తించిన నాడే ఆత్మహత్యల సంఖ్య తగ్గిపోతుంది. ఆ దిశగా మనమంతా కృషిచేద్దాం. ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దాం.