లండన్ : వయసు మీదపడుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కాపాడుకుంటూ దీర్ఘాయువునూ సొంతం చేసుకోవచ్చని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వయో వృద్ధుల్లో నరాల బలహీనత, కండరాల నొప్పులను నివారించేందుకు కకోవా, గ్రీన్ టీ మెరుగ్గా పనిచేస్తుందని ఏజింగ్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది.
గ్రీన్ టీ, కకోవాలో ఉండే ఫ్లేవనాయిడ్స్ ద్వారా వయో వృద్ధుల్లో నరాల వ్యవస్ధ బలోపేతమవుతుందని తెలిపింది. వృద్ధుల్లో శారీరక సామర్ధ్యాన్ని క్షీణింపచేసే సర్కోపెనియా వృద్ధుల జీవిత నాణ్యతను తగ్గిస్తుందని, ఇది వైకల్యం, కండరాల క్షీణతకు గురిచేసి మరణాలకూ దారితీస్తుందని అధ్యయనం పేర్కొంది.
వయసు మీదపడేకొద్దీ వాటిల్లే కండరాలు, నరాల బలహీనతను ఫ్లేవనాయిడ్లు కలిగిన కకోవా, గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చని అధ్యయన రచయిత, స్పెయిన్‌కు చెందిన యూనివర్సిటీ డిలెదకు చెందిన జోది కాల్డెరో వివరించారు. వృద్ధుల జీవన నాణ్యతా ప్రమాణాలను పెంచడంలో ఫ్లేవనాయిడ్స్‌తో కూడిన ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. చాక్లెట్ బార్స్, గ్రీన్‌టీని నిత్యం తగిన మోతాదులో తీసుకుంటే వృద్ధుల్లో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని తాజా పరిశోధన వెల్లడించింది.