Health Tips : శారీరక వ్యాయామంతో యాంగ్జైటీని మెరుగ్గా నియంత్రించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. తీవ్ర యాంగ్జైటీ లక్షణాలు కూడా ఎక్సర్‌సైజ్‌తో తగ్గుముఖం పడతాయని జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్‌లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. గోథెన్బర్గ్, హాలండ్ కౌంటీల్లో యాంగ్జైటీతో బాధపడే 286 మంది రోగులపై ఈ పరిశోధన చేపట్టారు.
వీరిలో సగం మంది పదేండ్ల నుంచి యాంగ్జైటీతో బాధపడుతుండగా వీరి సగటు వయసు 39. వీరిలో 70 శాతం మంది మహిళలని అధ్యయన నిర్వాహకులు వెల్లడించారు. వీరికి 12 వారాల పాటు ఎక్సర్సైజ్ సెషన్‌ను నిర్వహించగా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత వీరిలో యాంగ్జైటీ లక్షణాలు తగ్గినట్టు గుర్తించారు.
కఠిన వ్యాయామాలు చేసిన వారిలో యాంగ్జైటీ లక్షణాలు మరింత తగ్గుముఖం పట్టినట్టు పరిశోధనలో వెల్లడైంది. శారీరక వ్యాయామం అధికంగా చేసిన వారిలో యాంగ్జైటీ లక్షణాలు బాగా మెరుగయ్యాయని తేలిందని హాలండ్ ఫిజిషియన్, అధ్యయన రచయిత మలిన్ హెన్రిక్సన్ తెలిపారు. ఇక నిత్యం వ్యాయామంతో కుంగుబాటు సమస్య నుంచి బయటపడవచ్చని కూడా గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి.