న్యూఢిల్లీ : వయసు మీదపడేకొద్దీ ఎముకలు, కండరాలు పటుత్వం కోలోవడంతో పాటు బ్రెయిన్పైనా వృద్ధాప్య ప్రభావం అధికంగా ఉంటుంది. వయసుమీరే ప్రక్రియ నుంచి ఆరోగ్యం కాపాడుకోవడంపై దీర్ఘకాలంగా వైద్య నిపుణులు పరిశోధనలు చేపడుతున్నారు. వయోసంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు, మెరుగైన ఆరోగ్యానికి కాఫీ, కొకొవా పానీయాలు అద్భుత ఔషధంగా పనిచేస్తాయని మాలిక్యులర్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్ తాజా అధ్యయనం వెల్లడించింది.
కాఫీ, కొకొవా నిత్యం తీసుకుంటే మెదడు పనితీరు మెరుగవుతుందని పరిశోధకులు తెలిపారు. వేడి వేడి కాఫీ లేదా కొకొవాతో మెదడు చురుకుగా పదునుగా తయారవుతుందని వెల్లడించారు. మతిమరపు సమస్యలకూ ఇవి చెక్ పెడతాయని అధ్యయనం పేర్కొంది. పన్నెండేండ్ల పాటు 842 మందిపై న్యూరోసైకలాజికల్ పరీక్షలు నిర్వహించిన మీదట శాస్త్రవేత్తలు ఈ వివరాలు వెల్లడించారు.
పాలీపెనాల్ పుష్కలంగా ఉండే ఆహారంతో మెదడు ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాఫీ, కొకొవా, పుట్టగొడుగులు, రెడ్వైన్లో పాలీపెనాల్ అధికంగా ఉంటుంది. వయోభారంతో తలెత్తే సమస్యలను పాలీపెనాల్ అధికంగా ఉండే ఆహారం నియంత్రిస్తుంది. కాఫీ, కొకొవాతో గుండె, లివర్, కిడ్నీల ఆరోగ్యానికీ మేలు చేకూరుతుందని, బరువును నియంత్రించడంలోనూ దోహదపడతాయని పరిశోధకులు తెలిపారు.