Stevia Leaves | ప్రస్తుత తరుణంలో ఏటా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అస్తవ్యవస్తమైన జీవన విధానమే టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు ప్రధాన కారణంగా చెబుతుంటారు. అయితే టైప్ 2 డయాబెటిస్ వచ్చిన వారు డాక్టర్లు ఇచ్చే మందులతోపాటు ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడంతోపాటు వేళకు భోజనం చేయాలి. తగినన్ని గంటలపాటు నిద్రించాలి. ఇలా చేస్తే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే షుగర్ ఉన్నవారు తీపి తినకూడదన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది తీపి తినలేకపోతున్నామని బాధపడుతారు. అయితే ఈ మొక్క గురించి తెలిస్తే షుగర్ ఉన్నవారు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ మొక్కను తీపికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఇంతకీ ఆ మొక్క ఏమిటి.. అది మనకు ఎలా మేలు చేస్తుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీవీల్లో, న్యూస్ పేపర్లలో షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ లేదా పొడి అని యాడ్స్ వస్తూ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు. వాటిలో జీరో క్యాలరీలు ఉంటాయని, చక్కెరకు బదులుగా వాడవచ్చని, షుగర్ పేషెంట్లు తీపికి బదులుగా వాటిని వాడుకోవచ్చని, వాటితో షుగర్ లెవల్స్ అసలు పెరగవని చెబుతుంటారు. అయితే ఆయా పదార్థాల తయారీకి స్టీవియా అనే మొక్క ఆకులను ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల నుంచి తీసిన పదార్థాన్నే అలా పొడి లేదా ట్యాబ్లెట్లుగా తయారు చేస్తారు. కనుక ఈ మొక్క ఆకులను డయాబెటిస్ ఉన్నవారు ఉపయోగించవచ్చు. దీంతో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవడమే కాకుండా చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఈ ఆకులను ఉపయోగించవచ్చు. పలు అధ్యయనాలు చెబుతున్న ప్రకారం స్టీవియా ఆకులను వాడితే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా శోషించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
స్టీవియా ఆకుల్లో సున్నా క్యాలరీలు ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఓ వైపు తీపి రుచిని ఆస్వాదిస్తూనే మరోవైపు బరువు తగ్గించుకోవచ్చు. ఈ ఆకులను వాడితే బరువు పెరుగుతామన్న భయం ఉండదు. మరోవైపు ఆహారాలను తియ్యగా ఆస్వాదించవచ్చు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఈ ఆకులను వాడితే కడుపు నిండిన భావన కలుగుతుందని తేలింది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. స్టీవియా ఆకుల్లో గ్లైకోసైడ్స్ ఉంటాయి. ఇవి రక్త నాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
దంతాలు, చిగుళ్లు, నోటి ఆరోగ్యానికి కూడా ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. స్టీవియా ఆకులను నోట్లో వేసుకుని నమిలి తింటుంటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. చిగుళ్ల నుంచి రక్త స్రావం అవడం తగ్గుతుంది. స్టీవియా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆకుల్లో ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి జరగకుండా చూస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షించుకోవచ్చు. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఆర్థరైటిస్ నొప్పులు, వాపుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అలాగే అలర్జీలు తగ్గేందుకు సహాయం చేస్తాయి. ఇలా స్టీవియా ఆకులతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.