Spending Time in AC | ప్రస్తుత తరుణంలో ఏసీల వాడకం ఎక్కువైంది. ఒకప్పుడు కేవలం ధనికులు లేదా కార్పొరేట్ ఆఫీసుల్లోనే ఏసీలను వాడేవారు. కానీ ఇప్పుడు దాదాపుగా ప్రతి పనిచేసే చోట ఏసీలను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఏసీలను వేసవిలోనే వాడాల్సి ఉంటుంది. కానీ ఆఫీసుల్లో అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి కనుక ఏసీలను అధికంగా వాడుతున్నారు. అయితే ఏసీల కారణంగా మన ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందన్న విషయాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ఏసీల్లో నిత్యం అధిక సమయం పాటు గడపడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీల్లో గడపడాన్ని తగ్గించుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఏసీల్లో అధిక సమయం ఉంటే చర్మం తన సహజసిద్ధమైన తేమను కోల్పోతుంది. దీంతో చర్మం పొడిగా మారుతుంది. దురద పెడుతుంది. దీని వల్ల కొందరికి చర్మం పొట్టు రాలిపోయినట్లు వస్తుంది. ఇది మరింత అసౌకర్యాన్ని కలగజేస్తుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు దీని వల్ల మరిన్ని ఇబ్బందులు పడతారు. అయితే ఏసీల్లో గడపడం తగ్గిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. కానీ అది సాధ్యంకాకపోతే చర్మానికి కచ్చితంగా మాయిశ్చరైజర్ రాయాలి. లేదంటే చర్మం మరింత డ్యామేజ్ అవుతుంది. ఏసీల్లో అధికంగా గడపడం వల్ల శరీరంలోని ద్రవాలు త్వరగా బయటకు పోతాయి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో నోరు పొడిగా మారుతుంది. తీవ్రమైన అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తుంటే శరీరంలో నీరు తగ్గిందని అర్థం చేసుకోవాలి. దీన్నుంచి బయట పడేందుకు నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.
ఏసీలను ఉపయోగించే వారు కచ్చితంగా తరచూ వాటిని క్లీన్ చేయాలి. లేదంటే ఏసీ ఫిల్టర్లలో దుమ్ము, ధూళి కణాలు, కాలుష్య కారకాలు పేరుకుపోతాయి. ఇవి దీర్ఘకాలంలో మన శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. దీంతో దగ్గు, ముక్కు దిబ్బడ, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. కనుక ఏసీలను రోజూ ఉపయోగిస్తుంటే కచ్చితంగా తరచూ ఫిల్టర్లను క్లీన్ చేయించాలి. ఏసీల్లో ఎక్కువగా గడిపే వారికి కళ్లు పొడిబారుతుంటాయి. కళ్లలో ద్రవాలు ఆవిరైపోయి కళ్లు పొడిగా మారి దురద పెడతాయి. ఈ సమస్యను తగ్గించేందుకు రూమ్‌లో హ్యుమిడిఫయర్లను వాడాలి. లేదా కాంటాక్ట్ లెన్స్‌లను ధరించాలి. అలాగే ఏసీల్లో ఎక్కువ సమయం పాటు ఉంటే కీళ్ల నొప్పులు వస్తాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇలాంటి వారు పని మధ్యలో అప్పుడప్పుడు కచ్చితంగా లేస్తూ బయట గాలి తగిలేలా చూసుకోవాలి. కాళ్లను, చేతులను కదిలిస్తూ వార్మప్ చేయాలి.
వేడి వాతావరణంలో కన్నా చల్లని వాతావరణంలో ఉంటేనే మన శక్తి ఎక్కువగా ఖర్చవుతుంది. దీంతో తీవ్రమైన అలసట వస్తుంది. ఇలాంటి సమస్య ఎవరికైనా వస్తుంటే ఏసీల నుంచి కాసేపు బయటికి వచ్చి గడుపుతుండాలి. ఏసీల్లో ఎక్కువగా ఉండే వారికి తరచూ దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి ఏసీల్లో ఎక్కువగా ఉండేవారు అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఏసీల్లో గడిపే వారికి సైనస్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక ఏసీల వాడకాన్ని తగ్గించాలి. ఇలా పలు రకాల జాగ్రత్తలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.