చలికాలంలో చర్మ సమస్యలు అధికమై.. తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. చర్మ సంరక్షణ కోసం లేనిపోని చిట్కాలు పాటిస్తుంటారు. అయితే, మన దినచర్యలో భాగమైన స్నానంతోనే అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. స్నానపు నీటిలో ఒక చిటికెడు పసుపును కలుపుకోవడం ద్వారా.. చాలా ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. ఎన్నో ఆయుర్వేద లక్షణాలు కలిగిన పసుపులో.. యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలం. ఇవి చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. పసుపు నీటితో స్నానం చేయడం వల్ల చర్మం రంగు మెరుగుపడటంతోపాటు సరికొత్త మెరుపు వస్తుంది. పసుపులోని యాంటి ఏజింగ్ గుణాలు.. చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్ లక్షణాల వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఇతర చర్మ సమస్యలూ దూరమవుతాయి. దురద, దద్దుర్లు తగ్గుముఖం పడతాయి. మొటిమలతోపాటు చర్మంపై ఉండే మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గిపోయి.. ముఖం కొత్త కాంతిని సంతరించుకుంటుంది. ఇక అనేక ఔషధ గుణాలున్న పసుపు నీటితో స్నానం.. శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. కీళ్ల నొప్పుల నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. శరీరాన్ని రిలాక్స్డ్గా మారుస్తుంది.