Too much sugar | ఇటీవల చక్కెర తీసుకునే అలవాటు చాలా మందిలో తగ్గిపోతుంది. చక్కెర ఎక్కువగా తీసుకుంటే లావైపోతామని, షుగర్ వ్యాధి వస్తుందని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా అనుమానిస్తున్నారు. టీ, కాఫీ, స్వీట్లు.. ఇలా అన్నింట్లోనూ చక్కెరను తగ్గించుకుంటూ చప్పగా తింటున్నాం. అయితే, షుగర్ పూర్తిగా మానేయడం కూడా మంచిది కాదంట. ఇదే సమయంలో చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదని సెలవిస్తున్నారు నిపుణులు. ఎక్కువ చక్కెరలు మనకు ఎన్నో ప్రమాదాలను తెచ్చి పెడతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
మన శరీరానికి చక్కెరలు అవసరం. శరీరంలో చక్కెర శాతం తగ్గిపోతే నీరసించిపోతాం. వెంటనే చక్కెర ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఒక్కసారి యాక్టీవ్ అయిపోతాం. అంటే శరీరం నీరసించి పోకుండా ఉండాలంటే చక్కెర అవసరమేనన్నమాట. శరీరంలో చక్కెర ఎక్కువైతే కాలేయంపై ప్రభావం చూపుతుంది. గ్లూకోజ్ శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి అధిక బరువు, కిడ్నీ సమస్యలు, హైబీపీ వచ్చేలా చేస్తుంది.
మనం స్వీట్లు తినడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ మనం తినే ఆహారాలు శరీరంలో చక్కెర స్థాయిలను విపరీతంగా పెంచుతాయి. శరీరంలో ఎక్కువ చక్కెర ఉండటం వల్ల మధుమేహంతోపాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నది. ఇక్కడ ఇచ్చిన సంకేతాలతో మన శరీరంలో ఎక్కువ షుగర్ ఉన్నదని తెలుసుకోవచ్చు.

చక్కెర కలిగిన ఆహారాన్ని తీసుకున్న తర్వాత అది ఇన్సులిన్ స్పైక్‌కు దారితీసే గ్లూకోజ్‌గా మారుతుంది. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల మంట, అదనపు నూనె ఉత్పత్తి, ఆండ్రోజెన్ స్రావం మొటిమలకు దారితీస్తుంది. ఎక్కువ చక్కెరను తీసుకునే వ్యక్తుల ముఖంపై మళ్లీ మళ్లీ మొటిమలు వస్తుంటాయి. అకస్మాత్తుగా మొటిమలు, విరేచనాలు ఎక్కువగా కనిపించాయంటే చక్కెర వినియోగాన్ని పరిమితం చేయండి అని సూచిస్తున్నట్లుగా భావించాలి.

పండ్లు, పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా సహజ చక్కెరలు శరీరానికి అందుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. అయితే ప్రాసెస్డ్, క్యాన్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. షుగర్‌తో కూడిన ఆహారం త్వరగా జీర్ణమై త్వరగా ఆకలి కలుగుతుంది. ఇది మన శరీరం బరువు పెరగడానికి దారితీస్తుంది. చక్కెర కలిగిన ఆహారాలు అధిక మొత్తంలో క్యాలరీలతో లోడ్ అయి ఉండి బరువు పెరగడానికి దారితీస్తుంది.

ప్రోటీన్లు లేదా కొవ్వులు లేని చక్కెర ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచేలా చేస్తాయి. దాంతో ఆ ఆహారాలను ప్రాసెస్ చేయడం శరీరానికి కష్టమవుతుంది. శక్తి కరిగిపోతుంది. ఇది చిరాకు, అలసటకు దారితీస్తుంది. వైట్ షుగర్ సైటోకిన్లను విడుదల చేసి వాపును కలిగిస్తుంది. దీని నుంచి విడుదలయ్యే ఒరెక్సిన్ మనలో నిద్ర వచ్చేలా, అలసటగా అనిపించేలా చేస్తుంది.

చక్కెరను లేదా చక్కెర ఉన్న ఆహారాల్ని తీసుకున్నప్పుడు శరీరం త్వరగా చక్కెరను రక్తంలో కలిపేసుకుంటుంది. దాంతో తక్కువ సమయంలోనే మళ్లీ మనలో ఆకలి మొదలవుతుంది. చక్కెర టేస్ట్ బడ్స్‌కు సంతృప్తి కలిగించినప్పటికీ.. ప్రోటీన్లు, పోషకాలు, ఫైబర్లు మొదలైన వాటి కొరత కారణంగా కడుపును సంతోషపెట్టదు. ఇది మనం చక్కెర పదార్థాలను బలవంతంగా తినేలా చేస్తుంది. ఫలితంగా శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తింటుంటాం. దీని కారణంగా ఎప్పుడు చూసినా మనలో ఆకలి కలిగిన భావన ఉంటుంది.

చక్కెర ఆహారాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు మంచి నిద్రకు అంతరాయం కలుగుతుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ను పెంచి, అడ్రినలిన్, కార్టిసాల్‌ను విడుదలకు దారితీసి నిద్రను ప్రేరేపిస్తుంది. నిద్ర రావాలంటే మనకు మెగ్నీషియం అవసరం. అయితే, చక్కెర చాలా మెగ్నీషియంను ఉపయోగిస్తుంది. ఇది నిద్ర సమస్యలను కలిగిస్తుంది. నిద్ర షెడ్యూల్లో జోక్యం చేసుకోకుండా ఉండటానికి ముఖ్యంగా రాత్రిపూట చక్కెరలను నివారించాలి.
ఇకనుంచి మీలో ఈ సంకేతాలు ఏవైనా కనిపిస్తే మీ శరీరంలో ఎక్కువ చక్కెరలు ఉన్నట్లుగా భావించాలి. తీసుకునే ఆహారాలపై దృష్టి పెట్టాలి. వాటిలో షుగర్ పరిమాణం తక్కువగా ఉన్నవాటినే ప్లేట్లోకి తెచ్చుకునేలా జాగ్రత్తపడాలి. ఒకవేళ శరీరంలో ఎక్కువగా ఉండే చక్కెరను శరీరం బయటకు పంపాలంటే.. పుష్కలంగా నీరు త్రాగాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.