మా పిల్లవాడి వయసు నాలుగు సంవత్సరాలు. ఆరు నెలల నుంచి బలహీనంగా ఉంటున్నాడు. బాగా నిద్ర పోతున్నాడు. బడిలో కూడా నిద్రిస్తున్నాడట. ఇంటికి రాగానే మళ్లీ పడుకుంటాడు. ఆడుకోవాలన్న ఆసక్తే లేదు. డాక్టర్కి చూపించాం. రక్త పరీక్ష చేయించాం. రక్తం తక్కువగా ఉందని చెప్పారు. రెండు వారాల నుంచి మందులు వాడుతున్నాం. అయినా మార్పు లేదు. ఏం చేయాలి?
సాధారణంగా నాలుగేళ్ల లోపు పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. ఉరుకులు పెడుతుంటారు. ఆడాలని ఉత్సాహంగా ఉంటారు. ఇటువంటి పిల్లల్లో చురుకుదనం తగ్గితే దానికి కారణం గుర్తించాలి. మీరు రక్త కణాలు తగ్గాయి అన్నారు. అది రక్తహీనతా? హిమోగ్లోబిన్ తగ్గిందా? ఎర్ర రక్తకణాలు తగ్గాయా? తెల్ల రక్తకణాలు తగ్గాయా? ప్లేట్లెట్స్ తగ్గాయా? స్పష్టం చేయలేదు. సమస్యను కచ్చితంగా నిర్ధారించాల్సి ఉంది. కాబట్టి, పిల్లల వైద్యులకు చూపించి అవసరమైన పరీక్షలు చేయించండి. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దు. ఐరన్ లోపం వల్ల రక్తం తగ్గి ఉండవచ్చు. అది ఈ ఆరు నెలల్లోనే ఎందుకు జరిగింది? గతంలో ఉంటే గుర్తించలేకపోయారా? శరీరంలో ఇతర సమస్యలు ఏవైనా ఉన్నాయా? నులి పురుగులు ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడే సరైన వైద్యం అందించడం సాధ్యమవుతుంది. మరోసారి డాక్టర్కి చూపించి అవసరమైన రక్త, మూత్ర పరీక్షలు చేయించండి.