Sesame Seeds Benefits | నువ్వులను ఎన్నో వేల సంవత్సరాల నుంచే వంటల్లోనూ, సంప్రదాయ వైద్య విధానంలోనూ ఉపయోగిస్తున్నారు. నువ్వులలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నువ్వులను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా నువ్వులను చలికాలంలో రోజూ తినాల్సి ఉంటుంది. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. నువ్వులను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు నువ్వుల్లో ఉంటాయి. నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, బి కాంప్లెక్స్ విటమిన్లు, క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని సంపూర్ణ పోషకాహారంగా చెప్పవచ్చు.
నువ్వుల్లో పాలీ అన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అలాగే నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగానే ఉంటాయి. నువ్వుల్లో సెసమిన్, సెసమోల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు.
నువ్వుల్లో క్యాల్షియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. రోజూ కాసిన్ని నువ్వులను తిన్నా చాలు క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీంతో ఎముకల ఆరోగ్యం మెరుగు పడుతుంది. నువ్వుల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. దీంతో శరీరంలో వాపులు తగ్గి తీవ్రమైన వ్యాధులు రాకుండా ఉంటాయి. నువ్వుల్లో లిగ్నన్స్, ఫైటో స్టెరాల్స్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు.
నువ్వుల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను పెంచుతుంది. ఫైబర్ వల్ల రోజూ సుఖ విరేచనం అవుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. నువ్వులను తినడం వల్ల చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. నువ్వుల నుంచి తీసే నూనెలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. అలాగే నువ్వుల నూనెలో ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. తరచూ నువ్వులను తినడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం నువ్వులను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయని తేలింది. నువ్వులు డయాబెటిస్ ఉన్నవారికి వరం అనే చెప్పవచ్చు. ఇవి ఇన్సులిన్ గ్రాహక శక్తిని పెంచుతాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. నువ్వుల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. నువ్వులను రోజూ మనం ఎలాగైనా తీసుకోవచ్చు. వీటిని సలాడ్స్ లేదా స్మూతీలలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే కాస్త వేయించి తినవచ్చు. స్నాక్స్ రూపంలో వీటిని బెల్లంతో కలిపి కూడా తినవచ్చు. ఇక చలికాలంలో నువ్వులను రోజూ తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీంతో శరీరం వెచ్చగా కూడా ఉంటుంది. ఇలా నువ్వులతో మనం అనేక లాభాలను పొందవచ్చు. కనుక వీటిని తప్పకుండా రోజూ తినాలి.