ప్రకృతి అమ్మలాంటిది. బిడ్డ బాగు కోసం అన్నీ ఇచ్చింది. కానీ, అమ్మను కాదని, అడ్డమైనవి తిని అడ్డంపడితే.. మళ్లీ ప్రకృతి చెప్పినట్టు వింటే అన్నీ సర్దుకుంటాయి. ఈ ప్రకృతి ధర్మాన్ని ఆచరిస్తే ఆహారమే ఔషధం. ‘లంఖణం పరమౌషధం’ అనే సత్యాన్ని చాటుతూ ఓ హెల్త్ స్టార్టప్ మొదలుపెట్టింది సింధూర బొర్ర. మన వంటిల్లే మందుల షాపు. ఆ వంటింటి నుంచే ఇంటింటికీ ఆరోగ్య పానీయాలను సరఫరా చేసి అవార్డులెన్నో గెలిచింది. ఇంజినీరింగ్ చదివిన ఈ అమ్మాయి ‘క్లెన్జ్ హై’ బ్రాండ్ నెలకొల్పడం వెనుక ఉన్న విశేషాలు ఆమె మాటల్లోనే..
బీటెక్ తర్వాత ఎం.ఎస్. (నెట్వర్క్ ఇంజినీరింగ్) చదవడానికి అమెరికా వెళ్లాను. అక్కడ కొంతకాలం ఓ స్టార్టప్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. అమెరికాలో ఉన్నరోజుల్లో.. ఓ డాక్టర్ శరీరంలోని టాక్సిన్స్ (వ్యర్థాలను) బయటికి పంపించేందుకు ఉపవాసం చేస్తూ కొన్ని రకాల ప్రత్యేకమైన జ్యూస్‌లు తాగుతుండేది. వాటిని ఆవిడే తయారు చేసుకునేది. పండ్లు, కూరగాయలతోపాటు కొన్ని మొక్కల శాఖీయ భాగాలతో జ్యూస్‌లు చేసుకుని తాగేది. నాకు నేచురోపతి పద్ధతి ఆచరించాలనే ఆసక్తి ఉంది. ఆమె చేసిన జ్యూస్‌లు తీసుకున్నాను. తను సూచించినట్టుగా తాగాను. నా శరీరంలోని టాక్సిన్లు పోవడం వల్ల శరీరం తేలిక పడింది. మానసికంగానూ ఉల్లాసంగా ఉన్నాను అనిపించింది. ఆ డాక్టర్ దగ్గరే జ్యూస్‌ల తయారీ నేర్చుకున్నాను. రెగ్యులర్‌గా వాడటం మొదలుపెట్టాను.
సంప్రదాయ వైద్యం
ఉద్యోగం బాగానే ఉన్నా, ఏదైనా సొంత వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంది. అమెరికా నుంచి ఇండియా వచ్చాను. నాన్నకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. అందులో చేరాను. నా దగ్గర అయిదు బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. వాటిలో ఇదొకటి. సాధారణంగా మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటి మూలాల గురించి తెలుసుకున్నాను. ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తింటున్నాం. ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకుని, అందులోని వ్యర్థాలను శరీరం నుంచి బయటికి పంపే అవకాశం ఇవ్వట్లేదు. ఆ వ్యర్థాలన్నీ కణాల్లో పేరుకుపోయి టాక్సిన్లుగా మారుతున్నాయి. వాటిని బయటికి పంపే అవకాశం శరీరానికి ఎవరూ ఇవ్వడంలేదు. ఉపవాసం ఉంటే ఆ టాక్సిన్లన్నిటినీ శరీరమే బయటికి పంపించేస్తుంది. ఉపవాసం ప్రాచీన కాలం నుంచి ఆచరణలో ఉంది. అన్ని మతాల్లోనూ ఉపవాసం ఆచరిస్తారు. శరీరం తనను తాను బాగు చేసుకునే అవకాశం ఉపవాసం కల్పిస్తుంది. ఈ పద్ధతిలో వెల్నెస్ బిజినెస్ చేయాలనుకున్నాను.
కిచెన్ టు కంపెనీ
ఉద్యోగం చేస్తూనే సొంత బిజినెస్ మోడల్ని డెవలప్ చేసుకున్నాను. పండ్లు, కూరగాయలు, మూలికలు, మొక్కల కాండాలతో ఎలాంటి జ్యూస్‌లు తయారు చేయవచ్చు, వాటితో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకునేందుకు పరిశోధన మొదలుపెట్టాను. అమెరికా డాక్టర్ సహకారంతో తను తయారుచేసే ఎనిమిది రకాల జ్యూస్‌లకు మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశాను. స్థానికంగా దొరికే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఉపయోగించాను. అయిదు రోజులపాటు ఉపవాసం ఉంటూ వాటిని వాడి చూశాను. నా శరీరం గతంకంటే మెరుగ్గా ఉందనిపించేది. మొదట ఇంట్లోనే జ్యూస్‌లు తయారుచేశాను. నేను వాడటంతోపాటు మా బంధువులు, స్నేహితులకు కూడా ఇచ్చాను. వాటిని వాడిన తర్వాత వాళ్ల ఆరోగ్యం ఎలా ఉంది. ఎలా ఫీలయ్యారో తెలుసుకుంటూ కొన్ని మార్పులు చేశాను. వాళ్ల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. వీటి విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నాను.
డిటాక్స్ డేస్
నేరుగా బిజినెస్‌గా ప్రారంభిస్తే ఎవరు కొంటారో తెలియదు. మూడు రోజులు ఉపవాసం ఉండాలంటే ఉంటారా? నమ్ముతారా? భోజనం, స్నాక్స్ తినకుండా, మధ్యలో టీలు తాగకుండా ఉంటారా? అనే సందేహాలు ఉన్నాయి. ఓ రోజు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ నన్ను సంప్రదించారు. ఈ ఆహార విధానం ఆయన నమ్మారు. ఆచరించారు. తర్వాత తన భార్య, కొడుకు ప్రాక్టీస్ చేశారు. ఇలా ఒకరి నుంచి మరొకరు మా జ్యూస్‌ల గురించి తెలుసుకున్నారు. మేము అందించే రెండు రకాల ప్రోగ్రామ్‌లలో క్లెన్జ్ ప్రోగ్రామ్ ఒకటి. కొత్తవాళ్లకు మూడు రోజులు, సీనియర్లకు అయిదు రోజుల ప్రోగ్రామ్ ఇది. ప్రతి రోజూ ఒక బాక్స్ ఇస్తాం. ఈ బాక్స్‌లో ఎనిమిది రకాల జ్యూస్‌లు ఉంటాయి. ఇవి తప్ప మరే ఆహారం తీసుకోకూడదు. మేమిచ్చే సీసాలపై నంబర్లు ఉంటాయి. ఆ నంబర్ల ప్రకారం తాగాలి. మరుసటి రోజు ఇంకో బాక్స్ వస్తుంది. రోజుకు ఎనిమిది బాటిల్స్ జ్యూస్ తాగాలి. ఈ సమయంలో ఘనాహారం తీసుకోవద్దు కాబట్టి జీర్ణ వ్యవస్థపై భారం పడదు. ఆహారాన్ని జీర్ణం చేయడం, అది కణాలకు చేరడం వంటి జీవక్రియలన్నీ ఉండవు. కాబట్టి ఆ సమయంలో కణాల్లోని వ్యర్థాలను బయటికి పంపే క్రియలు వేగంగా జరుగుతాయి. ఉపవాస సమయంలో జరిగే ఈ వ్యర్థాల తరలింపు సమయంలో విటమిన్లు, మినరల్స్ వంటి సూక్ష్మ పోషకాలను అధిక మొత్తంలో జ్యూస్‌ల రూపంలో అందిస్తాం. కాబట్టి ఇవి కణాలకు చేరతాయి. అందువల్ల శరీరంలోని సమస్యలను శరీరమే పరిష్కరించుకుంటుంది.
గొప్ప గుర్తింపు
మూడు నెలల్లో మా బ్రాండ్ గ్రో అయింది. ఆ తర్వాత కార్నెల్ యూనివర్సిటీ సింపోజియంకి వెళ్లాను. పోషకాలు తగ్గకుండా ఆహారం సహజత్వం కోల్పోకుండా తయారీ విధానాలను నేర్చుకున్నాను. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హ్యూమన్ న్యూట్రిషన్ సర్టిఫికేషన్ కోర్స్ చేశాను. ఇలా ఆహారం, ఆరోగ్యం గురించి నాలెడ్జ్ పెంచుకున్నాను. కొవిడ్ తర్వాత ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల మీద అవగాహన పెరిగింది. ఈ చైతన్యం వల్ల మా బిజినెస్ పెరిగింది. దేశమంతా ఇదే పరిస్థితి. కాబట్టి బెంగళూరులో కూడా ఉత్పత్తి ప్రారంభించాం. అక్కడా ఆదరణ బాగానే ఉంది. జనంతోపాటు ఎన్నో సంస్థలు మా ఉత్పత్తులను, ఆవిష్కరణలను గుర్తించాయి. ఎడ్ ఎక్స్ నుంచి ‘30 అండర్ 30 సౌత్ ఇండియన్ ఇన్నొవేషన్ స్టార్టప్స్’ గుర్తింపు వచ్చింది. ఇండియన్ హెల్త్ అండ్ వెల్నెస్ ఆర్గనైజేషన్ నుంచి ‘హోలిస్టిక్ కంపెనీ ఆఫ్ ఇండియా’ గెలుచుకున్నాం. బిజినెస్ వరల్డ్ ‘హెల్త్ అచీవర్ ఆఫ్ ఇండియా 2024’ అవార్డు గెలుచుకున్నాం. ఇక వెనక్కి తిరిగి చూసుకోనంతగా మా ప్రొడక్ట్స్‌కి గుర్తింపు, ఆదరణ వచ్చింది.
పర్ఫెక్ట్ రీసెట్!
రోజుల తరబడి సరైన ఆహారం తినకపోయినా, సరైన ఆహార నియమాలు పాటించకపోయినా శరీరం జబ్బుపడుతుంది. సబ్బులు, షాంపులు, క్రీములు, ఇంటిని శుభ్రం చేసే రసాయనాలు కూడా దేహంలోకి చేరతాయి. ఇవి బయటికి వచ్చే మార్గం ఉంది. కానీ, విశ్రాంతి లేని దేహానికి ఆ దారులు మూసుకుపోతాయి. అప్పుడే కొన్ని జబ్బులు మొదలవుతాయి. అధిక బరువు, డయాబెటిస్, థైరాయిడ్, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ అలా వచ్చే సమస్యలే. వీటి నుంచి ఉపశమనం కావాలి అనుకునేవాళ్ల కోసం ‘వెయిట్ అండ్ బాడీ రీసెట్’ ప్రోగ్రామ్ ఉంది. ఇది 15 రోజులు ఉంటుంది. ఇందులో రోజుకు నాలుగు రకాల జ్యూస్‌లు ఇస్తాం. రోజులో 16 గంటలు ఉపవాసం ఉండాలి. 8 గంటల వ్యవధిలోనే ఆహారం తీసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఈ నాలుగు రకాల జ్యూస్‌లు తీసుకోవాలి. ఈ సమయంలో భోజనం చేయొచ్చు. మాంసాహారం తినడం, ఆల్కహాల్, పొగ తాగడం చేయకూడదు. ఈ సమయంలో శరీరంలో నిల్వ కొవ్వులు సహజంగానే ఖర్చవుతాయి. శరీరంలోని కొవ్వులు తగ్గడంతోపాటు జీవక్రియల్లోనూ మార్పు వస్తుంది. చాలామంది బరువు తగ్గిపోయారు. కొంతమందికి లివర్ సమస్యలు తగ్గాయి. డయాబెటిక్ పేషెంట్లు కూడా పాటించారు. ఈ కోర్స్ చేయడానికి ముందు తర్వాత రక్త పరీక్ష చేయించుకుంటే బాడీ ఇన్ఫ్లమేషన్లో తేడా కనిపిస్తున్నది.
-నాగవర్ధన్ రాయల
అనుమల్ల గంగాధర్