లండన్ : నలభైల్లో పడగానే వయసైపోయిందని దిగాలుపడేవారికి కనువిప్పుగా సెంచరీ(100)కి చేరువైనా సెలయేరులా ఉరకలెత్తే ఉత్సాహంతో అందరిలో స్ఫూర్తి నింపే వారూ మన చుట్టూ కనిపిస్తుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం దీర్ఘాయువు రహస్యమని మరికొందరు చెబుతుంటారు. ఇక బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ టూ (95) అత్యధిక వయసు కలిగిన జీవించి ఉన్న మహారాణిగా గుర్తింపు పొందారు.
1926, ఏప్రిల్ 21న జన్మించిన క్వీన్ తన తండ్రి మరణంతో పాతికేండ్ల వయసులోనే పాలనా పగ్గాలు చేపట్టారు.క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఎదుగుతూ దీర్ఘకాలం జీవిస్తున్నారని బ్రిటిష్ సంస్కృతిపై పరిశోధన చేసిన కొలోవ్‌స్కీ లాంగ్ లివ్ ది క్వీన్ అనే పుస్తకంలో రాసుకొచ్చారు. ఆమె ఏం తింటారు..వర్క్ షెడ్యూల్..విశ్రాంతి వేళల్లో ఏం చేస్తుంటారనే విషయాలను అందులో ప్రస్తావించారు. ఇక ఆమె దీర్ఘాయువు వెనుక ఉన్న ఐదు రహస్యాలు ఏంటో చూద్దాం..
వర్కవుట్లు : ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలంటే అద్భుతమైన ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని చెప్పే వాదనకు భిన్నంగా క్వీన్ ఎలిజబెత్ వేగంగా నడవడం వంటి సెన్సిబుల్ ఎక్సర్సైజ్ను నమ్ముతారు. మీకు ఆనందం కలిగించే వ్యాయామం చేయడం కొనసాగించాలని పలు పరిశోధనలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఆహారం..మద్యం : రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో టీనేజర్‌గా ఉన్న క్వీన్ అప్పటి తన తరం వారందరిలాగే సింపుల్ మీల్స్ తీసుకునేందుకు మొగ్గుచూపేవారు. మధ్యాహ్నం శాండ్విచ్తో పాటు డార్జలింగ్ టీ తీసుకునేవారు. అప్పుడప్పుడూ కేక్స్ తినేందుకూ ఇష్టపడేవారు. ఇక మద్యం ముట్టరా అంటే రాజ కుటుంబీకులకు మద్యపానం అలవాటు ఉంటుందనడం బహిరంగ రహస్యమే. ఉదయం జిన్ కాక్‌టైల్‌ను ఎంజాయ్ చేసే క్వీన్ లంచ్‌తో పాటు షాంపేన్ లేదా ఓ గ్లాస్ వైన్‌ను టేస్ట్ చేస్తారు.
సాయంత్రం మరో గ్లాస్ వైన్ రాత్రికి డిన్నర్‌తో పాటు ఎప్పుడైనా డ్రింక్ తీసుకోవాలంటే జర్మన్ స్వీట్ వైన్ పుచ్చుకుంటారని రాజభవన మాజీ షెఫ్ డారెన్ మెక్ గ్రాడీ గతంలో చెప్పుకొచ్చారు. మితాహారంతో పాటు ఆమె రోజుకు నాలుగు గ్లాసులకు మించి మద్యం ముట్టరని కొలోవ్‌స్కీ తన పుస్తకంలో పేర్కొన్నారు. క్వీన్ భోజనప్రియురాలు కాకపోవడం ఆమె దీర్ఘాయువు రహస్యం కావచ్చన్నది నిపుణుల మాట.
మేకప్‌పై మక్కువ తక్కువ : క్వీన్ ఎలిజబెత్ అరుదుగా మేకప్ వేసుకుంటారు. ఎండలో తిరిగేందుకు ఇష్టపడని క్వీన్ ఖరీదైన కాస్మెటిక్ బ్రాండ్స్‌నే వాడాలని కోరుకోరు. రోజ్ మిల్క్ మాయిశ్చరైజర్‌ను వాడుతుంటారు.
చురుకైన మెదడు : వయసు మీదపడినా క్వీన్ చలాకీగా, ఆరోగ్యంగా ఉండటానికి ఆమె మానసిక ఆరోగ్యం కుదురుగా ఉండటమేనని కొలోవ్‌స్కీ చెబుతారు. ఆమె ప్రతిరోజూ ఉదయం వార్తాపత్రికలు చదువుతూ సామాజిక రాజకీయ పరిణామాలను క్షుణ్ణంగా తెలుసుకోవడంతో పాటు మెదడును చురుకుగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. గ్లాసు సగం నిండుగా ఉందనే ఆమె సానుకూల దృక్పధం కూడా ప్రతిఒక్కరూ అలవరచుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
మానసిక ఆరోగ్యం : ఔన్నత్యంతో కూడిన సంస్కృతి నేపధ్యంతో ఎదిగిన క్వీన్ ఎలిజబెత్ భావోద్వేగాల నియంత్రణ, సమన్వయం సాధించడంలో నైపుణ్యం సాధించారని కొలోవ్‌స్కీ అంటారు. మానసికంగా ధృడంగా ఉండే రాణి సైకాలజిస్టులు బెనిఫిట్ ఫైండిగ్గా పిలిచే ప్రక్రియను ప్రాక్టీస్ చేస్తారని చెబుతారు. 2002లో 101 ఏండ్ల వయసులో మరణించిన తన తల్లి కంటే క్వీన్ ఎలిజబెత్ ఎక్కువ కాలం బతుకుతారన్నది కొలోవ్‌స్కీ అంచనా. ఒత్తిడిని చిత్తు చేస్తూ తనంతట తాను ఎదగడం ఎలాగో ఆమెను చూసి నేర్చుకోవాలంటారు.