Sabja Vs Chia Seeds | బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ఇటీవల ఎక్కువగా చియా గింజలు, సబ్జా గింజలను ఆహారంలో చేర్చుకుంటున్నారు. నీటిలో నానబెట్టినప్పుడు రెండూ ఒకేలా కనిపించినప్పటికీ, వీటి ప్రయోజనాలు కొంత భిన్నంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించడంలో ఈ రెండు గింజలు వేర్వేరు విధాలుగా పనిచేస్తాయని వివరిస్తున్నారు. అయితే ఇవి నేరుగా కొవ్వును కరిగించవని, సరైన ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకున్నప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. చియా గింజల్లో సొల్యూబుల్ ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి నీటిలో నానిన తర్వాత జెల్లా మారి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీంతో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటానికి సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం బరువు నియంత్రణలో సహాయపడుతుందని పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి. చియా గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నడుము చుట్టుకొలత కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే చియా గింజల ప్రభావం నెమ్మదిగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా సమతుల ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు. కేవలం చియా గింజల వల్ల మాత్రమే బరువు తగ్గిపోదని స్పష్టం చేస్తున్నారు. సబ్జా గింజలు లేదా బేసిల్ సీడ్స్‌లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి నీటిలో చాలా వేగంగా జెల్ లా మారుతాయి. దీంతో కడుపు నిండిన భావన త్వరగా కలుగుతుంది. ఇది ఎక్కువగా తినే అలవాటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే అసిడిటీ, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా సబ్జా గింజలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. చాలామంది పొట్ట ఉబ్బరాన్ని కూడా పొట్ట కొవ్వుగా భావిస్తారని, ఇలాంటి సందర్భాల్లో సబ్జా గింజలు తక్షణ ఉపశమనం ఇస్తాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అయితే ఇవి నేరుగా కొవ్వును కరిగించవని, ఆకలి నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల ద్వారా బరువు నియంత్రణకు సహాయపడతాయని చెబుతున్నారు.
నిపుణుల ప్రకారం చియా గింజలు దీర్ఘకాలిక బరువు నియంత్రణ, మెటబాలిజం మెరుగుదల కోసం ఉపయోగపడితే, సబ్జా గింజలు తక్షణ ఆకలి నియంత్రణ, జీర్ణక్రియ సౌకర్యం కోసం ఎక్కువగా సహాయపడతాయి. అందుకే చాలా మంది పోషకాహార నిపుణులు ఈ రెండింటినీ మారుస్తూ తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ గింజలను ఉపయోగించే విధానం కూడా ముఖ్యమని చెబుతున్నారు. ఒకటి లేదా రెండు టీస్పూన్ల గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవాలి. నిమ్మరసం, స్మూతీలు, పెరుగులో కలిపి తీసుకోవచ్చు. అయితే ఎప్పుడూ పొడిగా తినకూడదని హెచ్చరిస్తున్నారు. అలాగే ఇవి భోజనానికి ప్రత్యామ్నాయం కాదని, సమతుల ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. సబ్జా గింజలు, చియా గింజలు రెండూ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలే. కానీ పొట్ట కొవ్వు తగ్గించడంలో వీటి ప్రభావం జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తేనే మంచి ఫలితాలు కనిపిస్తాయని వారు సూచిస్తున్నారు.