చపాతీలు, రొట్టెలను పెనం మీద చేసుకుంటాం. తర్వాత అది ఉబ్బడానికి నేరుగా మంట మీద ఉంచేస్తారు. అయితే, ఇలా చేయడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ వేడి దగ్గర వండినప్పుడు పదార్థాల నుంచి హెటెరోసైక్లిక్ అమైన్స్ (హెసీఏలు), పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్లు) ఉత్పత్తి అవుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇవి రెండూ కూడా క్యాన్సర్తో ముడిపడి ఉన్నట్టు తెలుస్తున్నది. అధిక ఉష్ణోగ్రతల దగ్గర ఆహార పదార్థాలను వేడి చేసినా, నేరుగా మంటపై వేడికి గురిచేసినా ఈ హానికారక రసాయనాలు తయారవుతాయి.
‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం… సహజ వాయువుతో పనిచేసే స్టవ్లు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, పార్టిక్యులేట్ మాటర్ లాంటి వాయు కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి, నేరుగా మంటపై పెట్టకుండా పెనం మీదే రొట్టెను ఓ వస్త్రంతో ఒత్తుతూ కాల్చడం ఉత్తమం. అదే నేరుగా మంటకు గురిచేస్తే రొట్టెలపై నల్లటి మాడు ఏర్పడుతుంది. వీటిలో ఆక్రిలమైడ్ అనే రసాయనం ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది క్యాన్సర్ కారకం అని తెలుస్తున్నది.