Rose Flowers | గులాబీ పువ్వులు అంటే సహజంగానే చాలా మంది మహిళలకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ పువ్వులను జుట్టులో ధరించడమే కాదు, చాలా మంది పూజలకు కూడా ఉపయోగిస్తుంటారు. గులాబీ పువ్వుల నుంచి తీసిన నూనెను పరిమళ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. గులాబీ నూనె నుంచి తయారయ్యే రోజ్ వాటర్‌ను ఆసియా, ఇతర దేశాలకు చెందిన వారు ఎక్కువగా సౌందర్య సాధన ఉత్పత్తుల్లోనూ వినియోగిస్తున్నారు. గులాబీ పువ్వు రెక్కల నుంచి రోజ్ సిరప్‌కు ఫ్రాన్స్ ప్రసిద్ధి చెందింది. అమెరికాలో ఫ్రెంచ్ రోజ్ సిరప్‌ని పలు రకాలుగా ఉపయోగిస్తారు. ఈ విధంగా గులాబీ పువ్వుల రెక్కలను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అయితే వీటిల్లో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
గులాబీ పువ్వుల రెక్కలతో జామ్, జెల్లీ, గుల్కండ్ వంటివి తయారు చేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు అనేక పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే గులాబీ పువ్వుల రెక్కలను వేసి మరిగించిన టీని తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. గులాబీ పువ్వులు మనకు కలిగే అనేక వ్యాధులను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. గులాబీ పువ్వుల టీని సేవిస్తే మాలిక్ యాసిడ్ లభిస్తుంది. అలాగే టానిక్ యాసిడ్ కూడా ఇందులో అధికంగానే ఉంటుంది. గులాబీ పువ్వుల రెక్కలతో తయారు చేసిన టీని రోజూ సేవిస్తే విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలోనూ గులాబీ పువ్వులు ఎంతో మేలు చేస్తాయి.
రోజూ భోజనం చేసిన తరువాత ఒకటి లేదా రెండు గులాబీ పువ్వుల రెక్కలను తింటుండాలి. లేదా వాటితో టీ తయారు చేసి అయినా తాగవచ్చు. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గులాబీ పువ్వుల్లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి గాయాలు, పుండ్లను కూడా త్వరగా మానేలా చేస్తాయి. ఈ పువ్వులను పేస్ట్‌లా చేసి గాయం లేదా పుండుపు రాసి కట్టులా కడుతుంటే అవి త్వరగా మానుతాయి. అలాగే గులాబీ పువ్వులతో తయారు చేసే గుల్కండ్‌ను తింటే దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు.
వేసవి తాపాన్ని తగ్గించేందుకు కూడా గుల్కండ్ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఒక స్పూన్ మేర తింటే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. గర్భిణీలు గుల్కండ్‌ను తింటే వారి శరీరంలోని వేడి పోతుంది. దీంతో రక్త స్రావం వంటి ప్రమాదాలు ఎదురుకాకుండా అడ్డుకోవచ్చు. గులాబీ పువ్వుల రసాన్ని 2 గ్రాముల మేర తీసుకుంటే వికారం తగ్గుతుంది. వాంతుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బాదంపాలలో గులాబీ పువ్వుల రసం కలిపి రోజుకు ఒక కప్పు మోతాదులో తాగుతుంటే రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారిస్తుంది. గులాబీ పువ్వులను స్నానం చేసే నీటిలో వేసి కాసేపు అయ్యాక ఆ నీటితో స్నానం చేయాలి. దీంతో శరీరం నుంచి వచ్చే చెమట దుర్వాసన తగ్గుతుంది. శరీరం సువాసనా భరితంగా మారుతుంది. కొబ్బరినూనెలో గులాబీ పువ్వుల రెక్కలను వేసి మరిగించి తిలకం తయారు చేసి ధరిస్తుంటే తల చల్లబడుతుంది. వేడి తగ్గుతుంది. మెదడు యాక్టివ్‌గా మారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇలా గులాబీ పువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.