Ridge Gourd Benefits | మార్కెట్లో మనకు రకరకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో బీరకాయలు కూడా ఒకటి. బీరకాయలను చాలా మంది అంత ఇష్టపడరు. బీరకాయలతో మనం రకరకాల కూరలు చేసుకోవచ్చు. వీటితో పప్పు లేదా పచ్చడి చేసుకోవచ్చు. టమాటా లేదా శనగపప్పు వేసి వండి తినవచ్చు. బీరకాయలు రుచిగానే ఉంటాయి. కానీ వీటి రూపం కారణంగా వీటిని తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే బీరకాయలను తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. బీరకాయల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. బీరకాయలను రోజూ నేరుగా తినడం ఇష్టం లేకపోతే వాటిని జ్యూస్ చేసుకుని అయినా తాగవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
బీరకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటి జ్యూస్‌ను తాగితే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. బీరకాయల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కొందరికి సీజన్లతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ శరీరంలో వేడిగా ఉంటుంది. దీంతో ఎల్లప్పుడూ చర్మం పగులుతుంది. అయితే అలాంటి వారు రోజూ బీరకాయ జ్యూస్‌ను తాగుతుంటే ఫలితం ఉంటుంది. బీరకాయ మన శరీరానికి చలువ చేస్తుంది. అందువల్ల వీటి జ్యూస్‌ను తాగితే శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారి మృదువుగా, తేమగా ఉంటుంది. చర్మం పగలదు.
బీరకాయల్లో జింక్, విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. బీరకాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. బీరకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు సైతం సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షించుకోవచ్చు.
బీరకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తులు, గొంతులో ఉండే కఫం మొత్తం కరిగిపోతుంది. బీరకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల బీరకాయలను తీసుకోవడం వల్ల మనకు 0.91 గ్రాముల ప్రోటీన్లు, 0.14 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, 1.72 గ్రాముల పిండి పదార్థాలు లభిస్తాయి. అలాగే బీరకాయల్లో బయోటిన్, ఐరన్, మెగ్నిషియం, జింక్ వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల బీరకాయ జ్యూస్‌ను తాగితే బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా బీరకాయలతో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని తీసుకోవడం మరిచిపోకండి.