Refined Wheat Flour | రిఫైన్డ్ గోధుమ పిండి. దీన్నే మైదా అని, ఆర్ పర్పోస్ ఫ్లోర్ అని కూడా పిలుస్తారు. బయట మనం తినే అనేక ఆహారాల్లో మైదానే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గోధుమ పిండిలోని ఫైబర్‌ను పూర్తిగా తొలగించి రీఫైన్ చేసి ఈ మైదా పిండిని తయారు చేస్తారు. అందువల్ల మైదా పిండిలో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అయితే కేవలం కార్బొహైడ్రేట్లు ఉండడం మినహా మన ఆరోగ్యానికి మైదా ఏ రకంగానూ మేలు చేయదని, దీంతో కలిగే నష్టమే అధికంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మైదాను అధికంగా తీసుకోవడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయని వారు అంటున్నారు. తరచూ మనం మైదాతో చేసిన అనేక ఆహారాలను తింటుంటాం. ఇవి మనకు హాని కలిగిస్తాయని వారు చెబుతున్నారు.
రీఫైన్డ్ చేయబడిన గోధుమ పిండిలో పోషకాలు అసలు ఉండవు. ముఖ్యంగా ఫైబర్ అసలే ఉండదు. బి విటమిన్లు అయిన థయామిన్, నియాసిన్, ఫోలేట్, ఐరన్, మెగ్నిషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా కోల్పోవాల్సి వస్తుంది. రీఫైన్ చేయబడని గోధుమ పిండిలో ఇవన్నీ ఉంటాయి. కనుక మైదాకు బదులుగా గోధుమ పిండిని వాడితే మేలు జరుగుతుంది. రీఫైన్ చేయబడిన పిండిలో గ్లైసీమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. అంటే ఈ పిండిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయని అర్థం. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీంతో దీర్ఘకాలంలో షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇప్పటికే షుగర్ ఉన్నవారు మైదాను తింటే షుగర్ మరింత పెరిగి ప్రాణాపాయం సంభవించే పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక మైదా మనకు పూర్తిగా హానికరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పిండి పదార్థాలను అధికంగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీంతో శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను కణాలు సరిగ్గా గ్రహించలేవు. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. ముఖ్యంగా బరువు పెరగడంతోపాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే మైదాను తింటే ఆకలి అంత త్వరగా తీరదు. దీంతో ఆహారం మరింతగా తింటారు. దీని వల్ల శరీరం శక్తిని కోల్పోయినట్లు అవుతుంది. నీరసంగా మారుతారు. అలసటగా అనిపిస్తుంది. అలాగే మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ఇన్ని అనర్థాలు సంభవిస్తాయి కనుక మైదాకు వీలైనంత దూరంగా ఉంటేనే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అయితే మైదాతో తయారు చేసిన అనేక ఆహారాలు మనకు బయట కనిపిస్తుంటాయి. దీంతో సహజంగానే నోట్లో నీళ్లూరతాయి. అలాంటప్పుడు ఆయా ఆహారాలను తినకుండా ఉండలేకపోతుంటారు. అలాంటి వారు తమ మనస్సును డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆయా ఆహారాలకు బదులుగా పండ్లు, నట్స్, విత్తనాలను తినాలి. ఇవి ఆకలిని తగ్గించడమే కాదు, పోషకాలను కూడా అందిస్తాయి. శరీర బరువు తగ్గేందుకు, షుగర్ లెవల్స్ అదుపులో ఉండేందుకు సహాయం చేస్తాయి. రోగాలను తగ్గించడంలో దోహద పడతాయి. కనుక మీకు ఇకపై ఆకలి అయినప్పుడల్లా మైదాతో చేసిన ఆహారాలు కూడా సహజసిద్ధమైన ఆహారాలను తినండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.