Raw Milk | చర్మ ఆరోగ్యం, జుట్టు ఆరోగ్యం మనం అందంగా కనిపించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. చర్మం, జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అనేక ఖరీదైన ఉత్పత్తులను వాడుతూ ఉంటాం. కొన్ని సార్లు అ ఖరీదైన ఉత్పత్తులను వాడడం వల్ల మంచి జరగడానికి బదులుగా చర్మానికి, జుట్టుకు హాని కలుగుతుంది. వీటిని వాడడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిని అందరూ కొనలేరు. అయితే మనం సహజ సిద్దంగా కూడా చర్మాన్ని, జుట్టును అందంగా, ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవచ్చు. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా, అందంగా చేయడంలో మనకు పచ్చి పాలు ఎంతగానో సహాయపడతాయి. పచ్చిపాలను పాశ్చరైజ్ చేయరు. కనుక వీటిలో పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పాలను చర్మం, జుట్టు సంరక్షణలో ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. పచ్చి పాలను వాడడం వల్ల చర్మానికి, జుట్టుకు కలిగే ప్రయోజనాల గురించి, అలాగే ఈ పాలను ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను సౌందర్య నిపుణులు తెలియజేస్తున్నారు.
పచ్చిపాలు సహజ క్లెన్సర్ గా పని చేస్తాయి. పచ్చిపాలు తేలికపాటి ఎక్స్ఫోలియేటింగ్, హైడ్రేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి. దీంతో చర్మం పూర్తిగా టోన్ అవుతుంది. చర్మంపై ఉండే మలినాలు కూడా తొలగిపోతాయి. చర్మంపై ఉండే పిగ్మెంటేషన్ ను తొలగించడంలో కూడా పచ్చిపాలు మనకు సహాయపడతాయి. పచ్చిపాలల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది నల్లని మచ్చలను, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. ఫేస్ మాస్క్ రూపంలో పచ్చిపాలను ఉపయోగించడం వల్ల మచ్చలు లేని అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. పచ్చిపాలల్లో బయోటిన్ అధికంగా ఉంటుంది. కనుక దీనిని వాడడం వల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది. దెబ్బతిన్న జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. పచ్చిపాలు కండిషనర్ గా కూడా పని చేస్తాయి.
స్ప్రే బాటిల్ లో పాలను పోసి జుట్టుపై స్ప్రే చేయడం వల్ల అందమైన, ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. అయితే పాలల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టును గట్టిగా చేస్తుంది. కనుక పాలను పలుచగా చేసి ఉపయోగించడం మంచిది. పచ్చి పాలను క్రమం తప్పకుండా వాడడం వల్ల వృద్దాప్య ఛాయలు తగ్గుతాయి. ఈ పాలల్లో ఉండే విటమిన్ ఎ ముఖంపై ముడతలను, గీతలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మానికి వేసే మాస్క్ లల్లో పచ్చి పాలను కలిపి ఉపయోగించడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మ కాంతి మెరుగుపడుతుంది. పచ్చిపాలల్లో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను చర్మానికి రాసుకుని 3 నిమిషాల పాటు వృత్తాకార దిశలో సున్నితంగా మర్దనా చేయాలి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తొలగి చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలల్లో ఒక టేబుల్ స్పూన్ తేనెవేసి బాగా కలపాలి. ఈమిశ్రమాన్ని చర్మంపై రాసి 5 నుండి 7 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే ఈ మిశ్రమాన్ని చర్మంతో పాటు జుట్టుకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత తేలికపాటి షాంపుతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తుంది. ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా అవుతుంది. ఈ విధంగా పచ్చిపాలు మన చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.