వేసవిలో అంబలి, రాగిజావ, జొన్నజావ మొదలైనవి తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. పోషకాహార నిపుణురాలిగా మీరూ ఏకీభవిస్తారా?
-ఓ పాఠకురాలు
తప్పకుండా. వేసవిలో ఎండలు మండిపోతూ ఉంటాయి. శరీరానికి ద్రవపదార్థాల అవసరం పెరుగుతుంది. అంబలిలాంటి ద్రవాహారాలు తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఎండవేడిమి నుంచి రక్షణ లభిస్తుంది. రాగుల్లో అపారంగా లభించే క్యాల్షియం ఎముకల దృఢత్వానికి ఉపకరిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తాయి. దానివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఒకేసారి పెరగవు. అందుకే మధుమేహులకు కూడా అంబలి, రాగిజావలాంటివి ఎంతో మేలుచేస్తాయి. జొన్నల్లోనూ చర్మానికి పనికొచ్చే విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది. జీవక్రియను మెరుగుపరిచే విటమిన్-బి కూడా పుష్కలం. దీన్ని తీసుకోవడం వల్ల ఐరన్, జింక్, మెగ్నీషియంలాంటి ఖనిజాలూ అందుతాయి. ఈ జావలు త్వరగా ఆకలి కానివ్వవు. ఫలితంగా, బరువు తగ్గవచ్చు కూడా. ఈ ద్రవాహారాలను ఎక్కువగా మజ్జిగతో కలిపి తీసుకుంటారు. ఇష్టాన్ని బట్టి పాలతోనూ చేసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం, రాత్రి.. ఎప్పుడు తీసుకున్నా మంచిదే.
-మయూరి ఆవుల, న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com