సౌకర్యవంతంగా నిద్రించడానికి తల కింద మెత్త తప్పనిసరి. అయితే, చాలా మందిలో మెత్త వాడటం మంచిదా, కాదా అనేసందేహం మాత్రం ఉండితీరుతుంది. మనం నిద్రించే విధానాన్ని బట్టి మంచిచెడ్డలు ఆధారపడి ఉంటాయి. కాకపోతే మెత్త వాడటం వల్ల లాభాలు, నష్టాల గురించి ఓ అవగాహన ఉంటే మంచిది.
పెట్టు కోకుంటే
వెన్ను అమరిక సరిగ్గా ఉంటుంది. సహజ భంగిమలో నిద్రిస్తాం. మెత్త పెట్టుకుంటే మెడ భాగం పైకి వంగుతుంది. పెట్టుకోకుండా పడుకుంటే వెన్ను సహజ భంగిమలో ఉండిపోతుంది. అలా వెన్నెముక మీద ఒత్తిడి తగ్గుతుంది. నొప్పి కూడా ఉండదు.
మరీ భారీ మెత్త ఉపయోగిస్తే వెన్ను అమరిక మీద ప్రభావం చూపుతుంది. దీంతో వెన్ను పట్టేసినట్టుగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. మెడ మీద ఒత్తిడి కూడా అధికమవుతుంది.
మెత్త లేకుండా నిద్రించడం వల్ల శరీరం సహజ నిద్రా భంగిమకు అలవాటు పడిపోతుంది. దీర్ఘకాలంలో ఇది నిద్రించే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల తలెత్తే మెడనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.పెట్టు
కోవాల్సి వస్తే…
పొట్టమీద ఫ్లాట్గా పడుకునే వారికి మెత్త అవసరం అంతగా ఉండదు. కానీ, వీపుపై, పక్కకు తిరిగి పడుకునేవారికి మాత్రం సరైన భంగిమ కోసం కొంత దన్ను అవసరమవుతుంది. అయితే, నిపుణులను సంప్రదించి సరైన మెత్తను ఎంపిక చేసుకోవాలి. అలాగని మరీ భారీది మాత్రం వాడకూడదు.
మెత్త లేకుండా నిద్రించడం కష్టంగా ఉంటే.. మొదట్లో పెద్ద దాని స్థానంలో కొంచెం పల్చగా ఉండేది వాడాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు మెత్త లేకుండా నిద్రించే దశకు చేరుకుంటాం. లేదంటే మెత్త లేకపోయినా వెన్ను, మెడ భాగాలకు ఇబ్బంది కలిగించని పరుపును ఎంచుకోవాలి.
మెత్త లేకుండా పడుకోవడం ఇబ్బందిగా ఉంటే ‘లో లాఫ్ట్ పిల్లో’ (మూడు అంగుళాల వరకు మందం ఉన్న దిండు) ప్రయత్నించవచ్చు. అవసరం అనుకుంటే నిపుణుల సలహా తీసుకోవాలి.
మెత్త కవర్లు
మెత్తను వాడేవాళ్లు వాటికి గౌచనలు తొడుగుతారు. వీటిని వారానికోసారి ఉతకాలి. అపరిశుభ్రమైన గౌచనలు బ్యాక్టీరియా లాంటి హానికరమైన సూక్ష్మజీవులకు నెలవులుగా మారతాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు బాటలువేస్తాయి. కాబట్టి, నాణ్యమైన నిద్రకు మెత్త పరిశుభ్రంగా ఉండటం కీలకం అని గుర్తుంచుకోండి.
టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ!
రోజుల తరబడి మెత్త గౌచనలు ఉతక్కపోతే, వాటిపై పేరుకుపోయే బ్యాక్టీరియా టాయిలెట్ సీట్లపై ఉండేవాటి కంటే ఎక్కువే ఉంటుందని కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
ఇబ్బందులు
పక్కకు తిరిగి పడుకునే వారికి మెత్త లేకుంటే అసౌకర్యంగా ఉంటుంది. వెన్నుకు అనుకూలంగా ఉండటానికి మెడకు దన్ను అవసరమవుతుంది. అలానే పడుకుండిపోతే మెడ, భుజాలు నొప్పిపెడతాయి.