పైల్స్ అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. అయితే సాధారణంగా అంతగా ఇబ్బందిపెట్టని పైల్స్, మనల్ని బాధకు గురిచేసినప్పుడు వాటిని పైల్స్ (మొలలు) వచ్చాయి అంటారు. అంతేతప్ప పైల్స్ అంటే సమస్య ఉన్నవారిలోనే ఉంటాయని అర్థంకాదు. మనిషి శరీరంలో ఉన్న ప్రతి భాగం ఏదో రకంగా మనిషికి ఉపయోగపడేదే అయ్యుంటుంది. మరి అలాంటిది పైల్స్ పీడిస్తున్నాయని వాటిని తీసేస్తే… వాటి పని ఏ అవయవం చేస్తుంది? అసలు పైల్స్ అంటే ఏమిటి, సమస్య ఎలా ఉత్పన్నమవుతుంది, చికిత్స ఏంటి అనేవి తెలుసుకుందాం.
ఇక పైల్స్ శాకాహారులకు రావని కొందరు అనుకుంటారు. మనం ఆహారంలో వాడే మసాలా పదార్థాలు జీర్ణక్రియకు బాగా ఉపయోగ పడుతాయి. అయితే, మసాలాలు కూడా మితం తప్పి వినియోగించ కూడదు. అంతేకాకుండా, కొవ్వు పదార్థాలు కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి.
పైల్స్ మలద్వారం పట్టు నుంచి చుక్క నీరు కూడా బయటికి రాకుండా గేట్ కీపర్స్ లాగా అడ్డుపడుతాయి. మలద్వారం నుంచి నీరు బయటికి రాకుండా పైల్స్ 20 శాతం వరకు అడ్డుకుంటాయి. మిగతా 80 శాతం స్పిగర్స్ అడ్డుకుంటాయి. ఇక ఎవరికైనా పైల్స్ సమస్య తలెత్తినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అవి… మలద్వారం వద్ద నొప్పి, బయటికి మొలలలాగా రావడం, రక్తం కారడం, మలం బయటికి రాకుండా అడ్డుపడటం, ఫిస్టులా, ఫిషర్ కూడా రావచ్చు! ఎసిడిటీ కారణంగా కడుపులో మంట మొదలైనవి పీడిస్తాయి. స్త్రీలలో ప్రెగ్నెన్సీ సమయంలో కూడా పైల్స్ రావచ్చు. ఎందుకంటే మలద్వారం పైన బిడ్డ ఒత్తిడి పడటం దీనికి కారణమవుతుంది.
రెండు రకాల పైల్స్
పైల్స్‌ను ఇంగ్లిష్‌లో హెమరాయిడ్స్ అంటారు. ఇవి మలద్వారం లోపల కానీ, బయట కానీ వస్తాయి. పైల్స్ బాగా ఉబ్బితే లోపలినుంచి బయటికి వస్తాయి. దానిమీద ఒత్తిడి పడినప్పుడు పెద్ద పైల్స్ సాగిపోయి బయటికి వచ్చే అవకాశం ఉంది. మలద్వారం నుంచి రక్తం బయటికి రావడం ఒక్కటే పైల్స్కి కారణం కాదు. అది ఫిషర్ కూడా కావొచ్చు. పైల్స్… అంతర్గత హెమరాయిడ్స్, బాహ్య హెమరాయిడ్స్ అని రెండు రకాలు.
అంతర్గత పైల్స్ నొప్పి లేకుండా ఉంటాయి. అలాగే మల విసర్జన సమయంలో రక్తం రావడం కూడా ఉంటుంది. కొన్నిసార్లు అవి మలద్వారం బయటికి వచ్చి ఉంటాయి, వాటిని పాలిప్స్ పైల్స్ అంటారు. ఇక బాహ్య హెమరాయిడ్స్ అంటే మలద్వారం బయట వాపులు ఉండటం. రక్తం కారణంగా అవి ఉబ్బి నీలిరంగు గడ్డలుగా అయి తీవ్రమవుతాయి. ఇలాంటి వాటిని త్రాంబోస్డ్ (Thrombosed) పైల్స్ అంటారు.
Piles
ఎలా వస్తాయి?
మనుషులతోపాటు రెండు కాళ్లమీద నడిచే జీవులకు పైల్స్ సమస్య ఎప్పుడో ఒకప్పుడు తలెత్తక తప్పదు. ఇక పైల్స్ అంటే వంశపారంపర్యంగా వస్తాయని ఒకప్పుడు అనుకునేవాళ్లు. కానీ, దీనికి వేర్వేరు కారణాలు ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది.
అవేంటంటే…
లక్షణాలు
మనిషికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పైల్స్ సమస్య తప్పదనడం ఎందుకంటే.. ఏ మనిషి కూడా ప్రతిరోజూ ఒకే విధంగా మల విసర్జనకు వెళ్లడమనేది సాధ్యం కానిపని. మనిషి తినే ఆహారంతోపాటు తాగే నీరు, ఆహార విధానంలో మార్పులు కూడా జీర్ణ వ్యవస్థలో చాలామార్పులు తెస్తాయి. ఆహారం, నీరు కాకుండా ఒత్తిడి, వేళాపాళా లేని నిద్ర అలవాట్లు, ఓ నిర్ణీత పద్ధతంటూ లేని రోజువారీ జీవితం కూడా పైల్స్ సమస్యలో తమవంతు పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైనా ఒక గొట్టంలో నీరుపోసి మధ్యలో ఏదైనా అడ్డుగా ఉంచితే నీరు బయటికి రావడం కష్టమైపోతుంది. అదే మధ్యలో ఎలాంటి అడ్డు లేకుండా ఉంటే కష్టం ఉండదు. పైల్స్ సమస్య కూడా సరిగ్గా ఇలానే ఉంటుంది. మనం తినే ఆహారం జీర్ణమయ్యాక వ్యర్థాలు స్వేచ్ఛగా బయటికి వెళ్లిపోవాలంటే విసర్జన వ్యవస్థలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు.
డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి?
మలబద్ధకం, మలద్వారం దగ్గర రక్తం రావడం, నొప్పి, రక్తహీనత, బయటికి మొలలు తగిలి ఇబ్బంది పడేవాళ్లు, కూర్చోవడానికి కూడా కష్టంగా అనిపించినప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. అయితే డాక్టర్‌ను కలవడానికి ముందు ఇంటిచిట్కాలు పాటించవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది కీటో డైట్, క్రాష్ డైట్, ప్రొలాంగ్ స్టార్వింగ్ లాంటి రకరకాల పద్ధతులు బరువు తగ్గడానికి వాడుతున్నారు. వీటివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ దుష్ప్రభావం ముందుగా పేగు మలద్వారం దగ్గర కనిపిస్తుంది.
కొలనోస్కోపీ అవసరమా?
పూర్వం పేగు క్యాన్సర్ అంటే 50 ఏండ్ల తర్వాతే వస్తుంది అనుకునేవారు. కానీ, ఇప్పుడు 20, 30 ఏండ్ల వాళ్లు కూడా పేగు క్యాన్సర్ బారినపడటం చూస్తున్నాం. ఎవరికైతే మలద్వారం దగ్గర రక్తం, జిగురు పడుతుందో, మల విసర్జన ఎక్కువ అవడం, లేదంటే అసలే రాకపోవడం, జీర్ణవ్యవస్థలో తీవ్రమైన మార్పులు, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, వంశంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే గనుక కొలనోస్కోపీ అవసరమవుతుంది.
చికిత్స విధానాలు
ప్రాచీన కాలంలో పైల్స్ ఉన్న వ్యక్తిని అంటే ఉబ్చి బయటికి వచ్చిన వ్యక్తిని తలకిందులుగా చెట్టుకు కట్టేసి చికిత్స చేసేవారు. అలా మొదలైన మొలల చికిత్స ఎంతో పరిణతి సాధించింది. వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందకముందు మలద్వారం వివరాలు అంతగా తెలిసేవి కావు. మలద్వారం పొడవు ఎంత, పైల్స్ ఎక్కడ ఉంటాయి, జబ్బులతో కూడిన పైల్స్ ఏవి, మామూలు పైల్స్ ఏవి అనే తేడాలు కూడా గుర్తించలేకపోయేవారు.
కానీ, ఇప్పుడలా కాదు. కొలనోస్కోపీ, సీటీ స్కాన్, ఎంఆర్ఐలు ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. పైల్స్ సమస్య పూర్వాపరాలు, దాని చికిత్స అన్నీ అవగాహనకు వచ్చాయి. ఇకపోతే పైల్స్ సమస్యను మనం ఓ చెట్టుతో పోల్చవచ్చు. చెట్టుకు నీరు తగినంతగా అందిస్తే బాగా పెరుగుతుంది. లేదంటే అది ఎండిపోతుంది. అలాగే పైల్స్ ఉబ్బడానికి గల కారణం అధిక రక్తం పైల్స్‌లోకి వెళ్లడం. కాబట్టి, రక్తం వెళ్లే దారిని మూసివేస్తే పైల్స్ కూడా సాధారణ స్థానంలోకి వస్తాయి.
Hemorrhoids Symptoms
ఏ డాక్టర్‌ను కలవాలి?
పైల్స్ ఉన్నవాళ్లు చాలావరకు గ్యాస్ట్రో డాక్టర్‌ను కలవాలని అనుకుంటారు. స్త్రీలైతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. కానీ, పైల్స్ రోగులు ప్రాక్టాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించాలి.
చికిత్స విధానాలు
పైల్స్ వేధిస్తుంటే ప్రతి ఒక్కరూ లేజర్ చికిత్స అడుగుతారు. అయితే, ఈ సమస్యకు లేజర్ సర్జరీ ఒక్కటే మంత్రదండం ఏమీకాదు అని గుర్తుంచుకోవాలి. ఫోర్త్ గ్రేడ్ పైల్స్‌కు లేజర్ చికిత్స పనిచేయదు. ఎక్కువ కరెంట్ వాడితే మలద్వారం దెబ్బతింటుంది. దాని పటుత్వం పోతుంది. ఫిస్టులాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మలద్వారం నుంచి గాలి బయటికి వస్తున్నదా, నీరు వస్తున్నదా అనే గమనింపు సామర్థ్యం కోల్పోతారు. కాబట్టి పైల్స్‌కు వివిధ రకాల చికిత్సలను మేళవించి హైబ్రిడ్ పద్ధతిలో ఆపరేషన్ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ పద్ధతులు..
చివేట్స్లో హెమరాయిడోపిక్సీ ప్లస్ లేదా మైనస్ ఉపయోగించి లేజర్ కిరణాలతో గాటు పెట్టకుండా పైల్స్‌కు వెళ్లే రక్త ప్రసారాన్ని నిలిపివేస్తారు. దీంతో బయటికి సాగిపోయిన పైల్స్‌ను మళ్లీ పూర్వపు స్థితికి తీసుకువస్తారు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మలద్వారం దగ్గర వచ్చే ప్రతీ సమస్య పైల్స్ కూడా కాకపోవచ్చు. ఫిషర్, ఫిస్టులా, పాలిప్, ఆనల్ వార్ట్స్… ఇలా వివిధ రకాల సమస్యలు ఉండొచ్చు. డాక్టర్‌తో పరీక్ష చేయించుకుంటేనే అసలు విషయం బయటపడుతుంది.
Piles
ఎన్ని రోజుల్లో కోలుకుంటారు?
రోగులు దవాఖానలో ఒకటిరెండు రోజులు ఉంటే సరిపోతుంది. మూడు నుంచి ఐదు రోజుల్లో తమ పనులు తాము చేసుకోవచ్చు. ఆపరేషన్ అయిన మొదటిరోజే పైల్స్ సాధారణ స్థితికి వచ్చేస్తాయి. రెండు వారాల్లో రోగి మామూలుగా అయిపోతాడు. ఇక చివేట్స్ చికిత్సలో ఎలాంటి కృత్రిమమైన పరికరాలు వాడకం అనేది జరగదు. దీంతో రోగికి అసౌకర్యం కలగదు.
ఇక రోగులు కూడా పైల్స్ అనగానే భయపడిపోతారు. ఏమీ తినకుండా కుంగుబాటుకు లోనవుతారు. పైల్స్ భయంకరమైన రోగం కాదని గుర్తుంచుకోవాలి. సమస్య తలెత్తగానే డాక్టర్‌ను సంప్రదించాలి. ఏ విధమైన చికిత్స అవసరమో నిర్ధారణ చేసుకోవాలే తప్ప.. ‘ఆపరేషన్ లేకుండానే పైల్స్ తగ్గిస్తాం’ అనే నాటు వైద్యుల దగ్గరికి వెళ్లకూడదు. దగ్గర్లో ఉన్న ప్రాక్టాలజిస్ట్ను కలవాలి. మరో మాట కొంతమందిలో పైల్స్ క్యాన్సర్ కూడా అయ్యుండొచ్చు. అందుకని డాక్టర్‌ను కలవడం తప్పనిసరి. డాక్టర్ సలహాలు, చికిత్సతోపాటు సమతులాహారం, వ్యాయామం, తగినన్ని నీళ్లు, నాణ్యమైన నిద్ర ఉండేలా ప్రణాళిక వేసుకోవాలి. పండ్లు, తాజా కూరగాయలు, కీరదోస, క్యారెట్, బీట్రూట్, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.
డా॥ శాంతివర్ధని
సీనియర్ జనరల్ అండ్
లాపరోస్కోపిక్ సర్జన్
యశోద హాస్సిటల్స్, సికింద్రాబాద్