మేడమ్, ఈ మధ్యే నాకు ప్రసవం అయ్యింది. బాబు పుట్టాడు. గర్భధారణ సమయంలో నా చర్మం మీద మచ్చలు వచ్చాయి. ఇప్పటికీ తగ్గలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఉందా?
-ఓ పాఠకురాలు
గర్భధారణ సమయంలో చాలామంది మహిళలకు ముఖం, మెడ, చేతులు, చంకలు తదితర భాగాల్లో నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ప్రసవం తర్వాత కూడా కొనసాగుతాయి. వీటిని వైద్య పరిభాషలో ‘క్లోస్మా’గా వ్యవహరిస్తారు. మెలనిన్ అనే అమైనో యాసిడ్ కారణంగానే ఇదంతా జరుగుతుంది. అతినీల లోహిత కిరణాలకు చర్మం ప్రభావితం కావడం వల్ల ఈ సమస్య రావచ్చు. గర్భిణుల విషయానికొస్తే.. హార్మోన్ల మార్పు ప్రధాన కారణం. ఆ సమయంలో ఈస్ట్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల ఊట అధికంగా ఉంటుంది. ఆ ప్రభావం పిగ్మెంటేషన్‌కు దారితీస్తుంది.
హార్మోన్లు సాధారణ స్థితికి చేరుకోగానే.. వాటంతట అవే మాయమైపోతాయి. మాతృత్వం కోసం తీసుకొనే కొన్ని ఔషధాల కారణంగా కూడా ఇలా జరగొచ్చు. జన్యువుల ప్రభావాన్నీ కాదనలేం. మహిళ జీవితంలో ఆ తొమ్మిది నెలలూ కీలకం. కాబట్టి, పిగ్మెంటేషన్ చికిత్స తీసుకోవడం కుదరదు. తీసుకున్నా.. దుష్ప్రభావం చూపవచ్చు. కాబట్టి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, ఎండలోకి వెళ్తున్నప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం మంచిది. హైడ్రేషన్ ద్వారా కూడా ఈ సమస్యను నియంత్రించవచ్చు. కాబట్టి, పుష్కలంగా నీళ్లు తాగాలి. ప్రసవం తర్వాత, అదీ పిల్లలకు పాలిచ్చే దశ పూర్తయిన తర్వాతే.. పిగ్మెంటేషన్ చికిత్సకు వెళ్లడం శ్రేయస్కరం. మందులు, లేపనాలు, లేజర్ థెరపీ ద్వారా ఈ మచ్చలను తొలగించడం సాధ్యమే. కాబట్టి, భయపడాల్సిన పన్లేదు.
-డాక్టర్ అనున్యా రెడ్డి
ఇ.ఎన్.టి సర్జన్,
ఎలర్జీ స్పెషలిస్ట్,
ఫేసియల్ కాస్మొటిక్ సర్జన్