Eggs | కోడిగుడ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని అందరూ ఇష్టంగానే తింటారు. నాన్ వెజ్ తినని చాలా మంది గుడ్లను మాత్రం తింటుంటారు. కోడిగుడ్లతో అనేక వంటకాలు తయారు చేసి తింటారు. లేదా ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ రూపంలో తింటారు. కోడిగుడ్డును సంపూర్ణ పౌష్టికాహారంగా పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే గుడ్లలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. ఒక్క విటమిన్ సి తప్ప ఇందులో అన్ని రకాల పోషకాలను మనం పొందవచ్చు. కనుకనే రోజుకు ఒక గుడ్డును తప్పనిసరిగా తినాలని, ముఖ్యంగా పిల్లలకు తినిపించాలని చెబుతుంటారు. అయితే అంతా బాగానే ఉంది కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు లేదా వ్యాధులు ఉన్నవారు మాత్రం గుడ్లను తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడిగుడ్లను ఎవరు తినకూడదు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరికి ఫుడ్ అలర్జీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అలాంటి వారు కోడిగుడ్లను తినకపోవడమే మంచిది. అలర్జీలు ఉన్నవారు అందరికీ గుడ్లు రియాక్షన్‌ను కలిగించకపోవచ్చు. కానీ కొందరు కోడిగుడ్లను తింటే అందులో ఉండే ప్రోటీన్లను మన శరీర రోగ నిరోధక వ్యవస్థ హానికర బ్యాక్టీరియా అనుకుంటుంది. కొందరిలోనే ఇలా జరుగుతుంది. అలాంటి వారిలో అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో వాంతులు, విరేచనాలు అవడం, చర్మంపై దురదలు వచ్చి దద్దుర్లు ఏర్పడడం జరుగుతాయి. కనుక ఫుడ్ అలర్జీ ఉన్నవారు కోడిగుడ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అలాగే కొందరికి కోడిగుడ్లను తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా మారుతుంది. సరిగ్గా జీర్ణం కాదు. పుల్లని త్రేన్పులు కూడా వస్తుంటాయి. వీరిలో కొందరికి విరేచనాలు లేదా మలబద్దకం కూడా కలగవచ్చు. కనుక ఇలాంటి లక్షణాలు కనిపించేవారు కూడా గుడ్లను తినకూడదు.
కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు కూడా కోడిగుడ్లను తినకూడదు. కోడిగుడ్లలో ఉండే క్యాల్షియంను శరీరం శోషించుకుంటుంది. దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్లు లేని వారు కోడిగుడ్లను తినవచ్చు. కానీ స్టోన్స్ వచ్చి తగ్గిన వారు లేదా ఆ సమస్యతో ఇంకా బాధపడుతున్నవారు గుడ్లను తినకూడదు. లేదంటే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారు కూడా కోడిగుడ్లను తినకూడదు. అధికంగా కొలెస్ట్రాల్ ఉంటే శరీరంలో ఎల్డీఎల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్. దీని వల్ల గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక డాక్టర్ సూచన మేరకు వీరు గుడ్లను తినాల్సి ఉంటుంది. అలాగే గుండె జబ్బుల బారిన పడినవారు, హార్ట్ ఎటాక్ వచ్చి కోలుకుంటున్న వారు, హైబీపీ ఉన్నవారు కూడా డాక్టర్ సూచన మేరకే గుడ్డును తినాలి.
కొందరికి రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అలాంటి వారు గుడ్లను తింటే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడినవారు కూడా కోడిగుడ్లను తినకూడదు. ఎక్కువగా టైఫాయిడ్ వచ్చిన వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఉంటుంది. టైఫాయిడ్ వచ్చి తగ్గినా కూడా బ్యాక్టీరియా కొందరిలో అలాగే ఉంటుంది. కనుక కనీసం 15 రోజుల వరకు అయినా సరే నాన్ వెజ్, అందులోనూ గుడ్లను ముట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఇలా ఆయా అనారోగ్య సమస్యలు ఉన్నవారు కోడిగుడ్లను అసలు తినకూడదు. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు.