Thyroid | భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరు థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి 11 మందిలో ఒకరు డయాబెటిస్ బారిన పడుతున్నారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ రెండు వ్యాధులు ఒకదానికి ఒకటి ముడి పడి ఉన్నాయని. నిజానికి టైప్ 2 డయాబెటిస్ ఉన్న ప్రతీ నలుగురిలో ఒకరికి హైపోథైరాయిడిజం కూడా ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి పనిచేయని పరిస్థితి.
థైరాయిడ్, మధుమేహం మధ్య సంబంధం ఏంటి..?
థైరాయిడ్ అనేది ఆడమ్స్ ఆపిల్ (గొంతు ముందు భాగంలో కనిపించే ఉబ్బెత్తు భాగం) క్రింద, మెడ దిగువ భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది శరీరం యొక్క జీవక్రియను నియంత్రిస్తుంది. ఈ విధమైన నియంత్రణ శరీరం శక్తిని ఉపయోగించుకునే తీరును, నిల్వ తీరును ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు, ఇన్సులిన్ అనేవి శరీర శక్తి నిర్వాహకుల వంటివి. థైరాయిడ్ హార్మోన్లు మీ శరీరం ఎంత వేగంగా శక్తిని ఉపయోగిస్తుందో అనే దాన్ని నియంత్రించడంలో సహాయ పడతాయి. ఇన్సులిన్ మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. మీ జీవక్రియ సజావుగా సాగడంలో ఈ రెండూ కలిసి పెద్ద పాత్ర పోషిస్తాయి. కాబట్టి, థైరాయిడ్ పనితీరు దెబ్బతిన్నప్పుడు, అది రక్తంలో చక్కెర నియంత్రణను ప్రభావితం చేస్తుంది.
ఈ సందర్భంగా అబాట్ ఇండియా మెడికల్ అఫైర్స్ హెడ్ డాక్టర్ రోహిత శెట్టి మాట్లాడుతూ.. డయాబెటిస్తో బాధపడేవారు రక్తంలో చక్కెర స్థాయిల గురించి తెలుసుకోవాలి. హెచ్చుతగ్గులను ఎలా నిర్వహించాలో తెలుసుకోవాఇ. కానీ థైరాయిడ్ రుగ్మతలు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసినప్పటికీ, గుర్తించబడకపోవచ్చు. అందుకే క్రమం తప్పకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. సరైన జాగ్రత్తతో, థైరాయిడ్ రుగ్మతలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు, ప్రజలు ఆరోగ్యంగా, చురుకైన జీవితాలను గడపడానికి వీలు కల్పిస్తుందన్నారు.
అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రినాలజీ (హైదరాబాద్)కు చెందిన కన్సల్టంట్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ లావణ్య ఆలపాటి మాట్లాడుతూ.. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు తరచుగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఫలితంగా అవసరమైన సంరక్షణను అందుకోలేకపోతున్నారు. డయాబెటిస్ ఉన్న చాలా మందికి గుర్తించదగిన లక్షణాలు లేకుండా థైరాయిడ్ సమస్యలు ఉండవచ్చు. అలసట, జ్ఞాపకశక్తి లోపాలు, నిద్రలేమి, అధిక బరువు పెరగడం మొదలుకొని మలబద్ధకం, పొడి చర్మం, చలిని తట్టుకోలేకపోవడం, కండరాల తిమ్మిరి, ఉబ్బిన కనురెప్పలు దాకా ఈ లక్షణాలు ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం వల్ల శక్తి స్థాయిలు, బరువు, మానసిక స్థితి, హృదయ స్పందన రేటులో హెచ్చుతగ్గులు కూడా వస్తాయి. ఎందుకంటే ఈ విధులను నియంత్రించడంలో, శరీర ఆరోగ్యకరమైన అభివృద్ధికి మద్దతు ఇవ్వడంలో ఈ గ్రంథి ముఖ్యమైన పాత్ర పోషి స్తుంది. అందుకే ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి థైరాయిడ్ పనితీరు కోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం చాలా ముఖ్యం అని సూచించారు. థైరాయిడ్, మధుమేహంతో బాధపడేవారు మూత్రపిండాల సమస్యలు, గుండె పనితీరు సరిగా లేకపోవడం, రక్త ప్రసరణ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. నరాలు దెబ్బతినడం, గుండె జబ్బులు వంటి సమస్యలకు దారితీయవచ్చునని పేర్కొన్నారు.
రక్తంలో చక్కెర నియంత్రణను ప్రభావితం చేసే థైరాయిడ్ రుగ్మతల రకాలు:
హైపోథైరాయిడిజం (థైరాయిడ్ పనితీరు తగ్గడం)
హైపోథైరాయిడిజం శరీరం ఇన్సులిన్‌ను ప్రాసెస్ చేసే విధానాన్ని నెమ్మదింపజేస్తుంది. దీని అర్థం ఇన్సులిన్ రక్తప్రవాహంలో ఎక్కువసేపు ఉంటుంది, ఇది రక్తంలో చక్కెరలో ఊహించని తగ్గుదలకు కారణమవుతుంది. ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది, బరువు పెరగడానికి, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం కష్టమవుతుంది. మధుమేహం ఉన్నవారిలో, అత్యంత సాధారణమైన థైరాయిడ్ రుగ్మత సబ్‌క్లినికల్ హైపోథైరాయిడిజం, ఇది మీ థైరాయిడ్ గ్రంథి సాధారణంగా పనిచేయని పరిస్థితి, కానీ కనిపించే లక్షణాలు ఏవీ ఉండవు. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో మార్పుల కారణంగా టైప్ 2 డయాబెటిస్ హైపోథైరాయిడిజం వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
హైపర్ థైరాయిడిజం (అతి చురుకైన థైరాయిడ్)
హైపర్ థైరాయిడిజం జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల శరీరం ఆహారం నుండి గ్లూకోజ్‌ను త్వరగా గ్రహిస్తుంది. అయినప్పటికీ, కణాలు ఇన్సులిన్‌కు తక్కువ ప్రతిస్పందనను కలిగిస్తాయి, దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల డయాబెటిస్ ఉన్నవారికి స్థిరమైన గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడం సవాలుగా మారుతుంది. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండూ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి, కాబట్టి క్రమం తప్పకుండా పర్యవేక్షణ, నిర్వహణ అవసరం.
థైరాయిడ్ పనిచేయకపోవడాన్ని పరిష్కరించడం వల్ల మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మీ వైద్యులు సూచించిన సకాలంలో మందులు వాడడం వల్ల థైరాయిడ్, రక్తంలో చక్కెర స్థాయిలు రెండూ అదుపులో ఉంటాయి. మీ వైద్యులు సూచించిన విధంగా థైరాయిడ్ పని తీరు, బ్లడ్ షుగర్ టెస్టింగ్ కోసం క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల ఏవైనా మార్పులు ముందుగానే నిర్ధారణ అయ్యేలా చూసుకోవచ్చు.
చురుకుగా ఉండటం, బాగా తినడం, తగినంత నిద్రపోవడం ద్వారా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం నిజంగా సహాయపడుతుంది. మీకు థైరాయిడ్ రుగ్మతలు, మధుమేహం రెండూ ఉంటే, మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిం చాల్సి రావచ్చు. అలా శ్రద్ధ వహించడం వల్ల మీకు ఇష్టమైన కార్యకలాపాలను ఆస్వాదించడానికి మీకు మరింత శక్తి లభిస్తుంది.