ముక్కు వెనక, గొంతు పైభాగంలో ఉండే అడినాయిడ్స్ కణజాలంలో వాపు రావడాన్ని ‘అడినాయిడైటిస్’ అంటారు. పిల్లల్లో ఈ సమస్య సాధారణం. గురక, నోటినుంచి శ్వాస, మాటిమాటికీ చెవి ఇన్ఫెక్షన్లు, వినికిడి శక్తి తగ్గడం, శ్వాసలో ఇబ్బంది, పెదవులు పగలడం, ముక్కుకారడం, నోటినుంచి దుర్వాసన లాంటి సమస్యలకూ దారితీస్తుంది.
ఇన్ఫెక్షన్, అలర్జీ, పొట్టలో ఆమ్లం పైకి తన్నుకు రావడం వల్ల వచ్చే మంట మొదలైన కారణాలవల్ల అడినాయిడ్ కణజాలంలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడి.. అడినాయిడైటిస్ వస్తుంది. ఇది రెండేండ్ల వయసులో ఏర్పడి ఎనిమిదేండ్లు వచ్చే సరికి తగ్గిపోతుంది. అయితే, అడినాయిడ్స్ వాపు ఎక్కువ కాలం ఉంటే మాత్రం సమస్యాత్మకమే.
ముప్పు ఎవరికి?
సీసాపాలు తాగే పిల్లలు, పడుకున్న భంగిమలో తల్లిపాలు తాగే బిడ్డలకు, ముక్కు లేదా గొంతు దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నవారికి, ఏదైనా అలర్జీతో బాధపడే పిల్లలకు.
సైడ్ ఎఫెక్ట్స్?
చికిత్స తీసుకోకపోతే అడినాయిడైటిస్తో వచ్చే సమస్యలు ఇవీ… ముక్కుకారడం, మాటిమాటికి చెవి ఇన్ఫెక్షన్లు, వినికిడి శక్తి తగ్గడం, నోరు ఎండిపోవడం, పండ్ల నిర్మాణం దెబ్బతినడం (డెంటల్ కేరీస్), ముక్కుతో మాట్లాడినట్లు ఉండటం, సన్నని ముక్కు, పైపెదవి చిన్నగా ఉండటం, దంతాలు గజిబిజిగా రావడం.
చికిత్స ఎలా?
పిల్లల ముక్కు, చెవులు, నోరు, గొంతు పరీక్షించి వైద్యులు అడినాయిడ్స్ను నిర్ధారిస్తారు వైద్యులు. లక్షణాలు తీవ్రంగా ఉంటే శ్వాసనాళంలో ఆటంకాలను పరిశీలించడానికి ఎక్స్ రే పరీక్ష సూచించే అవకాశం ఉంది. లక్షణాలు పరిమితంగా ఉంటే మామూలు చికిత్స సరిపోతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే గనుక యాంటీబయోటిక్స్ ఇస్తారు. అడినాయిడ్స్ పరిమాణం తగ్గడానికి ముక్కు స్ప్రేలు సిఫారసు చేస్తారు. అయినా, వదలకపోతే ‘అడినాయిడెక్టమీ’ అనే సర్జరీ తప్పనిసరి.