Health Tips | చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల నోటి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. చిన్నారులకు ఎప్పుడు బ్రషింగ్ మొదలుపెట్టాలి, ఏ టూత్‌పేస్ట్ వాడాలి, వాళ్ల నోటి ఆరోగ్యం గురించి ఎలా శ్రద్ధ చూపాలి? అనే సందేహాలు సహజంగానే ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకుందాం!
చాలామంది పిల్లలకు దంతాలు వచ్చాకే నోటి ఆరోగ్యం పట్టించుకోవాలనే భావనలో తల్లిదండ్రులు ఉంటారు. కానీ దంతాలు రాకముందు నుంచే నోరు శుభ్రం చేయడం మొదలుపెట్టాలి.
ఆరు నెలలు వచ్చేటప్పటికి శిశువులు ఘనాహారం తినడం మొదలుపెట్టేస్తారు. కాబట్టి ఈ సమయం నుంచి చిగుళ్లను శుభ్రపర్చడం ఆరంభించాలి. దంతాలు లేనప్పటికీ ఆహార పదార్థాలు చిగుళ్లలో ఇరుక్కుపోతాయి. దీంతో ఆయా ప్రదేశాల్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. అయితే, ఈ దశలో సాధారణ బ్రష్ వాడకూడదు. మృదువుగా, సాగుదలతో ఉండే సిలికోన్ ఫింగర్ బ్రష్‌ను ఉపయోగించి పిల్లల చిగుళ్లను సున్నితంగా
శుభ్రంచేయాలి.
ఫింగర్ బ్రష్ అసౌకర్యంగా అనిపిస్తే తెల్లటి మస్లిన్ గుడ్డను కూడా వాడొచ్చు. ముందుగా స్వచ్ఛమైన నీళ్లలో మీ వేలిని శుభ్రం చేసుకోవాలి. దానికి మస్లిన్ గుడ్డను చుట్టుకోవాలి. శిశువులు తిన్న తర్వాత ప్రతీసారి మస్లిన్‌తో వాళ్ల నోరు శుభ్రం చేయాలి. పిల్లలకు మూడు నాలుగు దంతాలు వచ్చేవరకు ఈ విధానం మంచిది.
దంతాలు వస్తున్న దశలోనే టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్ పరిచయం చేయాలి. పిల్లలకు ప్రత్యేకించిన చిన్న టూత్‌బ్రష్ వాడాలి. ఇక టూత్‌పేస్ట్ విషయంలో అయితే, జీరో పీపీఎం ఫ్లోరైడ్ ఉన్నది ఎంచుకోవాలి. పరిమాణం విషయానికి వస్తే బియ్యం గింజంత సరిపోతుంది. అదే రెండు నుంచి ఆరేండ్ల పిల్లలకైతే 500 పీపీఎం ఫ్లోరైడ్ ఉన్నది ఎంచుకోవాలి. వీరికి బటానీ గింజంత ప్రమాణంలో పేస్టు తీసుకోవాలి. ఇది చిన్నారుల దంతాలు క్యావిటీస్ బారినపడకుండా కాపాడుతుంది.
ఆరేళ్లు వచ్చేటప్పటికి పిల్లల్లో పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తుంటాయి. దీన్నే మిశ్రమ దంతాల దశ అంటారు. ఈ దశలో దంతాలను క్యావిటీల బారినపడకుండా సంరక్షించుకోవాలి. కాబట్టి, దంతాల ఆరోగ్యం కోసం 1000 పీపీఎం ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ వాడాల్సి ఉంటుంది.
పిల్లలకు 12 ఏండ్లు నిండగానే పెద్దలు వాడే టూత్‌పేస్ట్‌కు మారిపోవాలి. 1000 పీపీఎం ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ను వాడాలి. ఇక పేస్ట్ పరిమాణం బ్రష్ వరకు తీసుకోవచ్చు. రోజుకు రెండుసార్లు రెండు నిమిషాలపాటు బ్రషింగ్ చేసే అలవాటును ప్రోత్సహించాలి. రెండో బ్రషింగ్ పడుకునే ముందు చేసుకోవడం మంచిది.
పిల్లల నోటి ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా దంతాల పరీక్ష చేయించాలి. దంత వైద్యులు పిల్లల దంతాలను సరైన పద్ధతిలో శుభ్రపరచడం, ఫ్లోరైడ్ ట్రీట్మెంట్, అవసరమైన సూచనలు ఇవ్వడం లాంటివి చేస్తారు. ఇలా పిల్లల రోజువారీ జీవితంలో నోరు, దంతాల సంరక్షణ వాళ్ల చిన్నతనంలోనే భాగం చేస్తే జీవితకాలంపాటు వారి చిరునవ్వులకు పునాది వేసినవాళ్లవుతామని గుర్తుంచుకోవాలి.