ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం అలవాటు గుండెపోటు, పక్షవాతం ముప్పును దాదాపు 26 శాతం పెంచుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అట్టావాలో ప్రొఫెసర్ జీన్ ఫిలిప్ చాపుట్ బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. సెలవులు ఉండే వారాంతాలు సహా ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రించి, ఒకే సమయంలో నిద్ర మేల్కోవాలని పరిశోధకుల సలహా.
“నిద్రించే క్రమంలో ఒక్క గంట తేడా వచ్చినా అది ఓ పద్ధతి లేని విధానంగానే పరిగణించాలి. ఇలా వారంలో ఐదు ఆరు రోజుల పాటు చేస్తున్నారంటే అది అలవాటుగా మారిందని గుర్తుంచుకోవాలి” అనేది జీన్ ఫిలిప్ మాట. అంతేకాదు వేర్వేరు సమయాల్లో నిద్ర మేల్కొనడం వల్ల శరీర జీవ గడియారం కూడా లయ తప్పుతుంది. ఇది భవిష్యత్తులో గుండె ఆరోగ్యానికి చేటు చేస్తుందట.