మోకాలి కీళ్లు క్రమంగా క్షీణించే వ్యాధి.. నీ ఆస్టియో ఆర్థరైటిస్ (ఓఏ) . దీనివల్ల మోకాళ్లలోని ఆర్టిక్యులర్ కార్టిలేజ్ రోజురోజుకూ క్షీణిస్తూ ఉంటుంది. వయోధికుల్లో సహజంగా తలెత్తే సమస్య ఇది. వయసుతోపాటే దాడి తీవ్రం అవుతుంది.గాయం వల్ల మోకీళ్లు దెబ్బతినడం, కుటుంబంలో ఆస్టియో ఆర్థరైటిస్ చరిత్ర ఉండటం, వివిధ కారణాల వల్ల మోకాళ్లు వంకరగా మారడం.. వంటివి కూడా కొందరిలో చిన్న వయసులోనే నీ ఆర్థరైటిస్‌కు దారితీస్తాయి.
మోకీళ్లలో నొప్పి.. నీ ఆస్టియో ఆర్థరైటిస్ తొలి సంకేతం. కొన్నిసార్లు నొప్పి నిరంతరంగా ఉంటుంది. కొన్నిసార్లు అప్పుడప్పుడూ వచ్చిపోతుంది. ఈ వ్యాధి వల్ల కదలికలు కష్టతరం అవుతాయి. కండరాలు బలహీనపడతాయి. కీళ్ల దగ్గర ఒరుసుకుంటున్నట్టు శబ్దాలు వినిపిస్తుంటాయి. అయితే పట్టేసినట్టు ఉండటం, వాపు, మోకాలు కుదురుగా ఉండలేకపోవడం.. లాంటివి కూడా నీ ఆస్టియో ఆర్థరైటిస్ సాధారణ లక్షణాలు. నొప్పి, రోజువారీ పనులు చేసుకోవడం కష్టం కావడం, నడవడం-నిలబడటం-మెట్లెక్కడం ఇబ్బందికరం అనిపించడం, మానసిక కుంగుబాటు.. మొదలైన సమస్యలవల్ల జీవన నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి, నొప్పి తీవ్రంగా వేధిస్తే.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
వ్యాధి నిర్ధారణ కోసం నిపుణులు మోకాలి రేడియోగ్రాఫ్ తీసుకుంటారు. దీని ఆధారంగా తీవ్రతను బట్టి నీ ఆర్థరైటిస్‌ను నాలుగు దశలుగా వర్గీకరిస్తారు. మొదటి దశ ప్రాథమికమైంది. నాలుగోదశ సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. మొదటి రెండిటిని సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాథమిక దశలుగా పరిగణిస్తారు. ఈ దశల్లో జీవనశైలి మార్పులు, వైద్యం సిఫారసు చేస్తారు. రోగులు సైతం మోకాళ్ల మీద తక్కువ ఒత్తిడి పడేలా చూసుకోవాలి. నొప్పిని తీవ్రతరం చేసే పనులు చేయకూడదు. ఈ దశలో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (పీఆర్పీ), హయలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్లు లేదా స్టెమ్ సెల్ కాన్సెంట్రేట్స్ ఇంజెక్షన్లు ప్రధానంగా సిఫారసు చేస్తారు.
Osteoarthritis
సర్జరీ లేకుండా..
ఆస్టియో ఆర్థరైటిస్ నిర్వహణను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి.. శస్త్రచికిత్సతో సంబంధంలేనివి, శస్త్రచికిత్సకు సంబంధించినవి. సర్జరీతో సంబంధంలేని పద్ధతులు ఇవీ..
బరువు తగ్గడం
బరువు తగ్గడం వల్ల మోకాలు కీలు మీద తక్కువ ఒత్తిడి పడుతుంది. శరీరం పనితీరు, బయోమెకానిక్స్ మెరుగుపడతాయి. కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఆస్టియో ఆర్థరైటిస్ నెమ్మదించడంలో దోహదపడతాయి.
బాధా నివారిణులు
వివిధ కారణాలను బట్టి కొన్ని రకాల అనల్జీసిక్స్ ఉపయోగిస్తారు. గుండె కవాటాలు, పొట్టకు సంబంధించిన, మూత్రపిండ సంబంధమైన సమస్యలు లేకపోతే నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలతో ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్సకు ఎన్ఎస్ ఎయిడ్స్ డాక్టర్లు సిఫారసు చేస్తారు. తాత్కాలిక ఉపశమనం కోసం ఏ సిఫారసు లేకుండా వేసుకోవడానికి (ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్) పారాసెటమల్‌ను ఆశ్రయించవచ్చు. అయితే అదీ మితంగానే. పెయిన్ కిల్లర్లను ఎక్కువగా తీసుకుంటే శరీరం మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు పడతాయి.
ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (పీఆర్పీ)
మనిషి రక్తకణాల్లోని ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఆటోలోగస్ అగ్లామ రేషన్‌లో ప్లేట్లెట్స్ స్రవించే కొన్ని వృద్ధి కారకాలు ఉంటాయి. ఇవి అవయవాలకు ఒక రూపాన్ని ఇచ్చే మెసెంఖైమల్ కణజాలానికి స్వస్థత చేకూరుస్తాయి. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ తొలిదశ చికిత్సకు సహాయకారిగా ఉంటుంది.
ఇంట్రా ఆర్టిక్యులర్ హయలురానిక్ యాసిడ్ (ఐఏ-హెచ్ఏ) ఇంజెక్షన్స్
నీ ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్సలో ఐఏ-హెచ్ఏ ఇంజెక్షన్లది పరిమిత పాత్రనే. నోటిద్వారా లేదంటే ఇతర మార్గాల్లో మందుల వల్ల కానీ, భౌతికంగా (ఫిజికల్లీ) చికిత్సతో తగిన ఉపశమనం లభించనప్పుడు ఓ మోస్తరు మోకాలు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న రోగులకే దీన్ని సూచిస్తారు. అయితే ఇది సామాన్యులకు అందుబాటులో లేనంత ఖరీదైన వ్యవహారం.ఫలితాలు కూడా అంత కచ్చితంగా ఉండవు. దీంతో అత్యవసర (ఫస్ట్‌లైన్) చికిత్సగా సిఫారసు చేయరు. అయితే రోగిని వేధించి పరిమితమైన వాపు, నొప్పులను మినహాయిస్తే.. ఐఏ-హెచ్ఏ చికిత్స సురక్షితమైనది. ప్రభావవంత మైనది కూడా. కాకపోతే హెచ్ఏ ఇంజెక్షన్‌తోపాటు కార్టికో స్టెరాయిడ్లు లేదా పీఆర్పీ కూడా కలిపి చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు వైద్య నిపుణులు.
జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (జీఎన్ఆర్ఎఫ్ఏ):
రోగుల్లో నొప్పిని తగ్గించి, జీవన నాణ్యత పెంచడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. మోకాలు రక్తనాళాలకు దగ్గరగా ఉండే నరాలు లక్ష్యంగా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తారు. ఆస్టియో ఆర్థరైటిస్తోపాటు ఇతర రుగ్మతల కారణంగా సర్జరీ కష్టమయ్యే రోగులకు ఈ చికిత్స ప్రత్యేకం.
సర్జరీ తప్పనిసరి అయితే..
సంప్రదాయ వైద్యం విఫలమైనప్పుడు, రోగులు తమ రోజువారీ పనులు చేసుకోవడం కష్టమైన ప్పుడు డాక్టర్లు సర్జరీ సూచిస్తారు. ఎముకలో చిన్న మార్పు ద్వారా నొప్పిని తగ్గించే ఆస్టియోటొమి, పాక్షికంగా మోకాలు కీలు మార్పిడి, పూర్తి మోకాలు కీలు మార్పిడి.. ఇలా ఏదో ఓ సర్జరీ అవసరం అవుతుంది. రోబోలు, ప్రీఆపరేటివ్ సాఫ్ట్‌వేర్‌తో చేసే సర్జరీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దీనితో చికిత్సలో కచ్చితత్వం పెరిగింది. ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటున్నాయి. వీటి సాయంతో దీర్ఘకాలిక ఆర్థరైటిస్‌ను నయం చేయడం పూర్తిగా సాధ్యమే.ఎలాంటి సర్జరీ లేకుండానే ఆస్టియో ఆర్థరైటిస్ నుంచి ‘శాశ్వతంగా విముక్తి పొందొచ్చు’ (పర్మనెంట్ క్యూర్) అంటూ కొన్ని క్లినిక్‌లు ఊదరగొడుతుంటాయి. ఈ ప్రకటనలు పీఆర్పీ లేదా కాన్సెంట్రేటెడ్ స్టెమ్‌సెల్ ఇంజెక్షన్ల ద్వారా చేసే రిజెనరేటివ్ చికిత్సలకు సంబంధించినవి కావచ్చు. అయితే వాళ్లు జెనిక్యులర్
నర్వ్ అబ్లేషన్ చేసే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలపక పోవడాన్ని మనం గుర్తించాలి. ఆస్టియో ఆర్థరైటిస్ తొలిదశలో ఇలాంటి పద్ధతులు కొంతమేర ఉపశమనం కలిగిస్తాయేమో కానీ, పూర్తిగా తగ్గిస్తాయనడానికి మాత్రం ఎలాంటి ఆధారాలూ లేవు. జెనిక్యులర్ నర్వ్‌ను తొలగించే ప్రక్రియ సమర్థంగా చేయకపోతే మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. శస్త్ర చికిత్సకు తగిన సత్తువ లేకపోవడంతో.. ఏదో ఓ ఉపశమనం కోరుకునే
వారికి ఇవి కొంతమేర పనికి వస్తాయి.
ఎలాంటి సర్జరీ లేకుండానే ఆస్టియో ఆర్థరైటిస్ నుంచి ‘శాశ్వతంగా విముక్తి’(పర్మనెంట్ క్యూర్) అంటూ కొన్ని క్లినిక్‌లు ఊదరగొడుతుంటాయి. ఈ ప్రకటనలు పీఆర్పీ లేదా కాన్సెంట్రేటెడ్ స్టెమ్‌సెల్ ఇంజెక్షన్ల ద్వారా చేసే రీజెనరేటివ్ చికిత్సలకు సంబంధించినవి మాత్రమే. అయితే, వాళ్లు అరకొర సమాచారంతో, అశాస్త్రీయమైన ప్రచారంతో రోగుల్ని తప్పుదారిపట్టిస్తారు.
అపోహలు వాస్తవాలు
అపోహ: ఆస్టియో ఆర్థరైటిస్‌కు సర్జరీ తప్పనిసరి
నిజం: ఆస్టియో ఆర్థరైటిస్ తొలిదశలో ఉంటే కొన్ని జీవనశైలి మార్పులు, మందులు, ప్రత్యేకమైన ఇంజెక్షన్ల సాయంతో చికిత్స చేయవచ్చు. వ్యాధి విస్తరణను వాయిదా వేయొచ్చు.
అపోహ: పీఆర్పీ, స్టెమ్‌సెల్స్ ఆర్థరైటిస్‌ను పూర్తిగా నయం చేస్తాయి.
నిజం: ఇవి తొలిదశలోనే పనిచేస్తాయి. అయితే, ఆస్టియో ఆర్థరైటిస్ నివారణకు ఇవే పూర్తి పరిష్కారం అనడానికి సాక్ష్యాలు లేవు.
అపోహ: ఆస్టియో ఆర్థరైటిస్ మోకీలుకు వ్యాయామం మరింత కీడు చేస్తుంది.
నిజం: కీలులో కార్టిలేజ్ తిరిగి ఏర్పడటానికి వ్యాయామం సహకరిస్తుంది. కీలు చుట్టూ కణజాలానికి పోషణ అందిస్తుంది. కీలు బిగుసుదనాన్ని అడ్డుకుంటుంది. రోజూ వ్యాయామం చేసేవారికి భవిష్యత్తులో ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం తక్కువని అధ్యయనాల్లో కూడా వెల్లడైంది.
అపోహ: కేవలం పెద్దల్లోనే వస్తుంది.
నిజం: 45 నుంచి 50లలో ఉన్నవారిలో ఓఏ అభివృద్ధి చెందుతున్నట్టు ఆధారాలు ఉన్నాయి. రోజువారీ జీవన శైలితో ముడిపడిన వివిధ కారణాలతో ఓఏ అభివృద్ధి చెందుతుంది.
అపోహ: రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌తో పూర్తిగా తగ్గుతుంది.
నిజం: ఈ విధానం కొంతమేర మాత్రమే ఉపశమనం ఇస్తుంది. ముసలివారు, సర్జరీ సరిపడని వారికి తాత్కాలిక ఊరట (పాలియేటివ్) కోసం దీనిని సిఫారసు చేస్తారు. చురుగ్గా ఉన్న వారికి ఈ చికిత్స వల్ల మరింత కీడు జరుగుతుంది.
అపోహ: లక్షణాలు స్పష్టంగా కనిపించే వరకూ ఆగాలి.
నిజం: ఆర్థరైటిస్‌ను తొలిదశలోనే గుర్తించి, చికిత్స తీసుకోవడం మంచిది. జీవనశైలి మార్పులు, క్రమం తప్పని వ్యాయామం, తగిన ఆహారం ఆస్టియో ఆర్థరైటిస్ విస్తరించకుండా నివారిస్తాయి. ఎంత ఆలస్యం చేస్తే అంత ఇబ్బందికరం. శస్త్రచికిత్స తప్పకపోవచ్చు.
డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి
సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ & స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్.
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్.