గాలి కాలుష్యం వ్యక్తుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నదని అనేకానేక పరిశోధనలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇది మనుషుల ప్రాణాలనూ తోడేస్తున్నదనీ, భారతదేశంలోని ప్రజలు ఈ వాయు కాలుష్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. స్వీడన్‌లోని కరోలిన్స్కా వైద్య విశ్వవిద్యాలయం 2009-2019 మధ్యకాలంలో ఇండియాలోని 655 జిల్లాల్లో వాయు కాలుష్యం, మరణాలకు సంబంధించి చేసిన సర్వేను ఇటీవల లాన్సెట్ మెడికల్ జర్నల్ ప్రకటించింది. దీని ప్రకారం సుమారు 16.6 మిలియన్లు అంటే, కోటీ అరవై లక్షలకు పైగా మరణాలకు ఇక్కడి గాలిలోని పీఎం 2.5గా పిలిచే నలుసుల్లాంటి కాలుష్య పదార్థాలే కారణమని పేర్కొంది. అంటే, పాతిక శాతం మరణాలకు గాలిలోని పీఎం 2.5 హేతువుగా కనిపిస్తున్నదని తేల్చింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్‌కు ఇవి 5 మైక్రోగ్రామ్‌లు ఉండొచ్చని చెబుతుంటే, భారత్ ప్రమాణాల ప్రకారం అది 40 మైక్రోగ్రామ్‌లుగా ఉంది. ఒక వేళ దీని ప్రకారం చూసిన 38 లక్షలకు పైగా మరణాలు ఈ అతిసన్నని నలుసుల్లాంటి కణాలతో ముడివడి ఉన్నాయి. కానీ, భారత్ జనాభాలో 81.9 శాతం మంది ఇక్కడి ప్రమాణాలనూ మించిన కాలుష్య పరిస్థితుల్లోనే జీవిస్తున్నారన్న సత్యాన్ని ఈ సర్వే వెల్లడించింది. 2.5 మైక్రోగ్రాముల కన్నా తక్కువ వ్యాసం కలిగిన నలకల్లాంటి పదార్థాలనే పీఎం 2.5గా పిలుస్తారు. వాహనాలు, పరిశ్రమల పొగ, దుమ్ము తుపానుల్లాంటి వాటి వల్ల ఇవి గాల్లోకి చేరతాయి.
శ్వాస ద్వారా మనిషి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాసకోశ వ్యాధులు, లంగ్ క్యాన్సర్‌లాంటి వాటికి కారణం అవుతున్నాయి. రక్తంలోనూ చేరి రకరకాల జబ్బులను తెచ్చి పెడుతున్నాయి.పీఎం 2.5 ప్రతి క్యూబిక్ మీటర్‌కు 10 మైక్రోగ్రాములకు మించి పెరగడం అంటే, దాని వల్ల మరణం సంభవించడం అన్నది 8.6 శాతం ఎక్కువ అవ్వడమే అని ఈ అధ్యయనం చెబుతున్నది. కాబట్టి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన భారత్ గాలి నాణ్యతా ప్రమాణాల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవల్సిన అవసరాన్ని ఇది నొక్కి వక్కాణిస్తున్నది.