Omicron variant FAQs | రూపం మార్చుకున్న కరోనావైరస్ విరుచుకుపడుతుంది. దక్షిణాఫ్రికాలో నవంబర్ 24న బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్.. పదిరోజుల్లోనే 30 దేశాలకు విస్తరించింది. భారత్ సహా అగ్రరాజ్యం అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోనూ ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడంతో ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. భారత్‌లో అయితే థర్డ్ వేవ్ వస్తుందేమోనని ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే అసలు ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది? ఇప్పటివరకు ఉన్న వ్యాక్సిన్లు దీనిపై పనిచేస్తాయా? లేదా? అనే అనుమానాలతో బెంబేలెత్తిపోతున్నారు. దీంతో వీటికి సమాధానాల కోసం వెతుకుతున్నారు? ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్‌పై ఉన్న కొన్ని సందేహాలకు సమాధానాలు మీకోసం..
చైనాలో మొదట కనిపించిన కరోనా వైరస్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ ( బి.1.1529) చాలా భిన్నమైనది. సెకండ్ వేవ్ సమయంలో ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లలోని స్పైక్ ప్రోటీన్లలో రెండు, మూడు ఉత్పరివర్తనాలు మాత్రమే ఉన్నాయి. అలాంటిది ఒమిక్రాన్‌లో మాత్రం 50 మ్యుటేషన్లు ఉండగా.. వాటిలో 30 వరకు స్పైక్ ప్రోటీన్‌లోనే ఉన్నాయి. అందుకే డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల కంటే కూడా ఇది ప్రమాదకరమైనది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత లేదు. ఒమిక్రాన్ వేరియంట్ గురించి పూర్తి సమాచారం తెలియాలంటే అధ్యయనం కోసం రెండు వారాలు ఆగాల్సిందే.
కరోనాలోని ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ లక్షణాలు భిన్నంగా ఉంటాయని చెప్పేందుకు ఎలాంటి సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కానీ ఒమిక్రాన్ సోకిన వారిలో గొంతు, తల, ఛాతి నొప్పి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తలనొప్పితో పాటు ఒళ్లు నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కండరాల నొప్పితో ఒకటి రెండు రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది. కొంతమందిలో లక్షణాలు కూడా బయటపడటం లేదని వైద్యులు చెబుతున్నారు.
కరోనా ఇతర వేరియంట్లు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో.. అవన్నీ జాగ్రత్తలు పాటించాలి. కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకోవాలి. మాస్కులు ధరించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు ఇతర దేశాల మీద కూడా పంజా ఝళిపిస్తోంది. 30కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మరికొన్ని రోజుల్లోనే భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటంతో మన దేశంలో దీని తీవ్రత మాత్రం చాలా తక్కువగా ఉండొచ్చని పేర్కొంది.
ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్‌పై పనిచేయవని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కాకపోతే ఒమిక్రాన్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లోని కొన్ని మ్యుటేషన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని తగ్గించవచ్చని అనుమానిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు కూడా ఉన్నారని దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ ఏంజెలిక్ కొయెటీ వెల్లడించారు. అయితే వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉందని చెప్పారు. ఇక అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కొవాగ్జిన్ కొత్త వేరియంట్‌పై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ జన్యు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష రిపోర్ట్ రావడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది. డెల్టా లేదా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి, సీసీఎంబీ, సీడీఎఫ్‌డీలో జోనోమ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
సాధారణంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో ఎన్, ఎస్, ఈ, ఓఆర్ఎఫ్ జన్యువులు ఉంటాయి. ఒక వ్యక్తిలో ఎస్ జన్యువు లేకుండా మిగిలినవి పాజిటివ్‌గా ఉంటే.. జన్యు విశ్లేషణ అవసరం లేకుండానే ఒమిక్రాన్ సోకిందని ప్రాథమికంగా అంచనా వేయవచ్చు. కానీ పూర్తి నిర్ధరణ కోసం మాత్రం జన్యు విశ్లేషణ తప్పనిసరి. కానీ చాలా లేబరేటరీల్లో ఎస్ జన్యువును టెస్ట్ చేయట్లేదని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషీ చెప్పారు. అన్ని ల్యాబ్‌ల్లో ఎస్ జన్యువును పరీక్షించాలని మార్గదర్శకాలు వచ్చే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు.
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ముందుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. దాని రిజల్ట్ వచ్చే వరకు సదరు ప్రయాణికులు ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోనే ఉండాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే వారిని చికిత్స కోసం గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు తరలిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బెంగళూరులో 10 మంది దక్షిణాఫ్రికా వాసులు అదృశ్యం
40 ఏళ్లు దాటినవాళ్లకు బూస్టర్ డోసు ఇవ్వండి..
బెంగళూరులో ఒమిక్రాన్ కట్టడికి జర్మన్ మోడల్ ఆంక్షలు: కర్ణాటక ప్రభుత్వం
గ్రీకు అక్షరమాలలో ఒమిక్రాన్ సంఖ్య ఎంత ?
కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు పని చేయవనడానికి ఆధారాల్లేవ్ : కేంద్రం