Omicron may push Covid to turn endemic | ఎక్కడో చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. అల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ అంటూ తన రూపం మార్చుకొంటూ రెండేండ్లుగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఏ రూపంలో విరుచుకుపడుతుందో తెలియక ప్రజలు హడలిపోతున్నారు. ఈ మాయదారి కరోనా ఎప్పుడు అంతమైపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఊరటనిచ్చే విషయాలను తెలిపారు. రెండేండ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 అంతానికి వచ్చేసిందంటూ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా ఇక పాండమిక్ నుంచి ఎండమిక్ దశకు చేరుకుందని పేర్కొన్నారు..
అదేంటి ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వేగంగా విజృంభిస్తుంటే.. కరోనావైరస్ చివరి దశకు వచ్చేసిందని చెబుతున్నారేంటని గందరగోళానికి గురవుతున్నారా? ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్లో అత్యధిక మ్యుటేషన్లు.. స్పైక్ ప్రోటీన్‌లో ఉన్న మాట నిజమే. అందుకే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఇక్కడే మనం రిలాక్స్ అయ్యే ఒక విషయం ఉంది. అదేంటంటే.. దీని వ్యాప్తి మాత్రమే చురుగ్గా ఉంది.. ప్రభావం మాత్రం చాలావరకు తగ్గింది. ఇంతకుముందు ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో కరోనావైరస్ సోకితే ఐసీయూలో చేరడం, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం వచ్చేది.. కానీ ఇప్పుడు ఎక్కువమందికి కరోనావైరస్ సోకినప్పటికీ అంత సీరియస్ మాత్రం అవ్వట్లేదు. అంటే కరోనావైరస్ దాని సీరియస్‌నెస్‌ను క్రమంగా కోల్పోతోంది. ఇక తొందరలోనే ఇది సాధారణ ఫ్లూ వైరస్‌గా మారిపోతుంది. ఇదే విషయాన్ని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్. మోహన్‌రావు తెలిపారు. కొత్త వేరియంట్‌ను చూసి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని పరిశీలించి చూస్తే కరోనావైరస్ దాని ప్రభావం కోల్పోతుందని తెలుస్తుందని చెప్పారు. త్వరలోనే ఇది సాధారణ జలుబు, దగ్గు మాదిరిగా మారిపోతుందని పేర్కొన్నారు.
కరోనా చివరి దశకు చేరిందని నిన్నటికి నిన్న అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీ ఫైజర్ కూడా స్పష్టం చేసింది. వచ్చే ఏడాది లేదా రెండేండ్ల పాటు పలు ప్రాంతాల్లో మాత్రమే కరోనావైరస్ ఉంటుందని ఫైజర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ మైఖేల్ డోల్స్టన్ తెలిపారు. ఇక 2024 నాటికి దీని ప్రభావం తగ్గిపోతుందని పేర్కొన్నారు. అంతకుముందు 2022 నాటికి కరోనా అంతమవుతుందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌజీ అంచనా వేశారు.
కరోనా వైరస్ చివరి దశకు వచ్చేసిందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కూడా తెలిపారు. కరోనావైరస్ అంతంపై ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ కిందకు వస్తుంది. ఇలాంటి వైరస్లు ఎప్పటికప్పుడు రూపాంతంరం చెందినప్పుడే అవి మనుగడ సాధించగలుగుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వైరస్లు రూపాన్ని మార్చుకుంటుంది. దీన్నే మనం ఉత్పరివర్తనం ( మ్యుటేషన్ ) అని పిలుస్తాం. దీనివల్ల ఇవి ప్రమాదరహితంగా మారతాయి. ఈ మ్యుటేషన్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి కానీ వీటి ప్రభావం మాత్రం అంతగా ఉండదు. అందుకే దీన్ని చివరి దశ అంటారు. అంటే, వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కానీ తక్కువ జబ్బును కలిగిస్తుంది. 1914లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ( Spanish flu )ను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. అప్పట్లో స్పానిష్ ఫ్లూ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. కానీ ఆ తర్వాత ఈ వైరస్‌లో అనేక మార్పులు వచ్చి.. 1918 నాటికి సాధారణ ఫ్లూ వైరస్‌గా మారిపోయింది. ఇప్పుడు కరోనా వైరస్ కూడా రూపాంతరం చెందుతూ ప్రమాదరహితంగా మారుతుంది. కరోనా చివరి దశ తరువాత, వైరస్ అనేది సంవత్సరానికి ఒకసారి సాధారణ జబ్బులా వచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఏడాదికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే, ఆ మాత్రం జబ్బు కూడా రాదు అని చెప్పాడు.
వాతావరణం మారినప్పుడల్లా ఫ్లూ వైరస్ వస్తూనే ఉంటుంది. హెచ్1ఎన్1 వైరస్ ద్వారా ఈ ఫ్లూ వైరస్ వ్యాపిస్తుంది. తొలిసారిగా 19వ శతాబ్దంలో ఇది వెలుగులోకి వచ్చింది. 1918లో స్పెయిన్‌లో మొదలైన ఈ ఫ్లూ.. రెండేండ్లలో ప్రపంచమంతా సోకింది. దీంతో అప్పట్లోనే 5 నుంచి 10 కోట్ల మంది మరణించారు. ఇటీవలి చరిత్రలో అత్యంత తీవ్రమైన మహమ్మారి ఇదే. దీన్నే స్పానిష్ ఫ్లూ అని కూడా అంటారు. కరోనా సమయంలో మాదిరి క్వారంటైన్ ఉండటం, దూరం దూరం ఉండటం వల్ల ఈ అంటువ్యాధి వ్యాప్తిని నిర్మూలించగలిగారు. కాలక్రమేణా హెచ్1ఎన్1 వైరస్ క్షీణించి.. ఇప్పుడు అపాయం లేనిదిగా మారింది.
సాధారణంగా కొన్ని వ్యాధులు ఒక్కో ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతాయి. అది కూడా కొన్ని కాలాల్లో మాత్రమే ఆ వ్యాధులు ప్రభావం చూపిస్తాయి. అలాంటి వాటినే ఎండమిక్ వ్యాధులుగా పిలుస్తారు. మన దగ్గర డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, సీజనల్ ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులు ఎండమిక్ వ్యాధుల కిందకే వస్తాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
Shining Mask: కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
Omicron | ఒమిక్రాన్‌తో ప్రమాదమెంత.. అధ్యయనంలో కీలక విషయాలు
కొవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్నాక.. బూస్టర్ డోస్ కోవిషీల్డ్ వేసుకుంటే ఏమవుతుంది?
Omicron fears | కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?