శరీరం పోషకాలను విలీనం చేసుకోకపోతే ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు. ఆహారంలోని పోషకాలను ముందుగా చిన్నపేగులు శోషించుకుని, రక్త ప్రవాహానికి జతచేస్తాయి. ఆ శోషణ లేకపోతే.. మనల్ని మాల్ అబ్జార్పన్ సిండ్రోమ్ బాధిస్తుంది. మనం తినే ఆహారంలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, కొవ్వులు లాంటి స్థూల పోషకాలతోపాటు, విటమిన్లు, మినరల్స్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఇన్ఫెక్షన్ వల్ల పేగులు దెబ్బ తినడం, వాపులు, సర్జరీ, యాంటీ బయాటిక్స్ దీర్ఘకాలంపాటు వాడటం, ఉదర సంబంధ రుగ్మతలు, పిత్తాశయ వ్యాధులు మొదలైనవి ఈ మాల్ అబ్జార్పన్ సిండ్రోమ్‌కు దారితీస్తాయి. ఈ వ్యాధికి సంబంధించి కొన్ని సంకేతాలు…
జుట్టు రాలడం
పోషకాహార లేమి వెంట్రుకలు పెళుసు బారడానికి, రాలిపోవడానికి కారణం అవుతుంది. శరీరం పోషకాలను సరిగ్గా తీసుకోలేదనడానికి ఇదో సంకేతమే. వెంట్రుకలు రాలిపోవడం అనేది పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం లేదన్న ఓ హెచ్చరిక.
తిమ్మిర్లు- జలదరింపు
తిమ్మిర్లు పట్టడం, ఒళ్లు జలదరింపు లాంటివి పోషకలోపం వల్లే తలెత్తుతాయి. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం వల్ల ఇలా జరుగుతుంది. ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం, విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
అలసట-కండ్లు తిరగడం
ఆహారంలో మెగ్నీషియం, ఐరన్ లోపం వల్ల అలసటగా, కండ్లు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. పైగా శరీరానికి తగినంత ఐరన్ అందకపోతే రక్తహీనత వస్తుంది. ఇది మన భావోద్వేగాల మీద కూడా ప్రభావం చూపుతుంది.
గుండె దడ
ఐరన్ లోపం వల్ల గుండె దడ పెరుగుతుంది. గుండె లయలో తేడా రావడం, పరుగు పెడుతున్నట్లుగా అనిపించడం, పొడుస్తున్నట్లుగా ఉండటం లాంటివి గుండెదడ లక్షణాలు. ఐరన్ సమృద్ధిగా లేని ఆహారం వల్ల హృదయ స్పందన అసాధారణంగా మారుతుంది. గుండె దడకు బాటలు వేస్తుంది.
జీర్ణ సంబంధ రుగ్మతలు
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా లేకపోయినా కూడా శరీరం పోషకాలను తగినంతగా విలీనం చేసుకోలేదు. దాంతో పోషక లేమి ఏర్పడుతుంది. మన శరీర సామర్థ్యం తగ్గిపోతుంది. సరిగ్గా పనిచేసుకోలేం. మనం తినే ఆహారాన్ని జీర్ణవ్యవస్థ శోషింపజేసుకోవడం లేదంటే అది జీర్ణవ్యవస్థ అపరిశుభ్రతకు ఒక తీవ్ర సంకేతం.
Malabsorption Syndrome
పెళుసుబారిన గోళ్లు
పోషక లేమికి పెళుసుబారిన గోళ్లు కూడా ఒక సంకేతమే. తగినంతగా ప్రొటీన్లు లభించనప్పుడు శరీరం గోళ్ల పోషణకు అవసరమైనన్ని ప్రొటీన్లను పంపడం మానేస్తుంది. తేలికపాటి మాంసాహారం, చిక్కుళ్లు, కినోవా, చేపల లాంటి ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
వాపులు-ఉబ్బడం
శరీరానికి పోషకాలు లభించకపోతే వాపులు, ఉబ్బులు ఇబ్బందిపెడతాయి. ఒకవేళ కాళ్లలో వాపు కనిపించినా కూడా… అది ప్రొటీన్లు దండిగా లేని ఆహారం వల్లనే. ఛాతీలో ఇబ్బంది, ఆటంకంగా అనిపిస్తే.. అది కూడా పోషకాహార సంబంధమైన సమస్యే.
పోషకాల మిశ్రమం
కొన్ని రకాలైన ఆహారాలను మేళవించి తింటే శరీరం పోషకాలను విలీనం చేసుకునే సామర్థ్యం ఇనుమడిస్తుంది. ఉదాహరణకు, క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని విటమిన్-డి లభించే పదార్థాలతో కలిపి తింటే మంచిది. దీంతో విటమిన్-డి సాయంతో ఎముకలు క్యాల్షియంను బాగా శోషించు కుంటాయి. అందువల్ల, తగినన్ని పోషకాలను శరీరం సమకూర్చు కోవాలంటే తగిన మోతాదులో మిశ్రమ ఆహారం తీసుకోవాల్సిందే.
నెలసరి సమస్యలు
నెలసరి సక్రమంగా కావడం లేదంటే శరీరానికి క్యాలరీల రూపంలో తగినన్ని పోషకాలు అందడం లేదని అర్థం. సిరి ధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూర గాయలు లాంటివి ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.