న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న డెల్టా, అల్ఫా మినహా ఇతర కొత్త వేరియంట్లను గుర్తించలేదని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ పేర్కొన్నారు. ప్రస్తుత వేరియంట్స్‌తో పాటు నూతన వేరియంట్లు ఏమైనా ప్రబలుతున్నాయా అని గుర్తించేందుకు 80,000కు పైగా జన్యు సీక్వెన్సింగ్లను చేపట్టినట్టు డాక్టర్ స్వరూప్ వెల్లడించారు. రాష్ట్రాల వారీగా తమ శాఖల ద్వారా జన్యు సీక్వెన్సింగ్‌ను విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు.
పాన్ కరోనా వైరస్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రపంచంలో కొవిడ్-19 తొలి డీఎన్ఏ వ్యాక్సిన్ జైడస్ క్యాడిలా జైకోవ్-డీ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి డీసీజీఐ అనుమతి లభించిందని వెల్లడించారు. బయలాజికల్ ఈ వ్యాక్సిన్ కొర్బివ్యాక్స్ సెప్టెంబర్ చివరి నాటికి అనుమతి కోసం దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. భారత్ బయోటెక్ నాసల్ స్ర్పే కరోనా వ్యాక్సిన్ తర్వలోనే దేశీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.