స్కానింగ్‌లు, చర్మాన్ని కత్తిరించి చేసే ఇన్వేసివ్ పరీక్షలు వంటివి లేకుండానే సులువుగా రోగ నిర్ధారణ జరిగే రోజులు మరెంతో దూరంలో లేవు. పేగులకు సంబంధించిన కొలరెక్టల్ క్యాన్సర్ నిర్ధారణకు చేసే రక్త పరీక్షకు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఈ పరీక్షతో 83 శాతం కచ్చితత్వంతో రోగ నిర్ధారణ జరిగిందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది. అయితే ఇప్పటికీ పేగు క్యాన్సర్ నిర్ధారణకు కొలనోస్కోపీయే ఉత్తమమైన పరీక్ష.
అయినప్పటికీ కొత్తగా అభివృద్ధి చేసిన రక్త పరీక్ష కూడా ఉపయోగకరమైనదే అంటున్నారు పరిశోధకులు. ఇక వృద్ధాప్యానికి సంబంధించిన అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణకు ‘ప్రెసివిటీ ఏడీ2’ అనే రక్త పరీక్షను స్వీడన్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు.
అల్జీమర్స్ నిర్ధారణలో ఇది దాదాపు 90 శాతం కచ్చితత్వంతో ఉంటుందట. దీనిద్వారా అల్జీమర్స్‌కు వీలైనంత త్వరగా చికిత్స మొదలుపెట్టొచ్చని అధ్యయనం తెలిపింది. అంతేకాదు రక్తంలో ప్రవహించే ప్రొటీన్ల విధానాన్ని బట్టి డజన్ల కొద్ది వ్యాధుల గుట్టు తెలుసుకోవచ్చని ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ గ్లాక్సో స్మిత్ైక్లెన్కు చెందిన శాస్త్రవేత్తలు, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీకి చెందిన పరిశోధకులు కనుక్కొన్నారు. ఈ వ్యాధుల్లో మల్టిపుల్ మైలోమా, నాన్ హాడ్గ్కిన్ లింఫోమా, సీలియాక్ డిసీజ్ వంటివి కూడా ఉన్నాయి.