‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం..క్యాన్సర్‌కు కారకం..’ అనే మాట ఎక్కడ చూసినా కనపడుతుంది. బస్సులు, సినిమా థియేటర్లు, దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాల్లో.. ఇలా అనేక చోట్ల బోర్డులు దర్శనమిస్తాయి. ధూమపానం చేసే వ్యక్తికి క్యాన్సర్ లేదా ట్యూమర్స్ రిస్క్ పొంచి ఉంటుంది. పురుషుల్లో లైంగిక కోరికలు, అంగస్తంభనకు ఆటంకం కలిగిస్తుంది. గర్భిణులకు ధూమపానం అనేక సమస్యలను కలిగిస్తుంది. పుట్టే బిడ్డలు తీవ్ర అనారోగ్యంతో ఉంటారు.
సిగరెట్, బీడీల తయారీలో వాడే పొగాకు లేదా తంబాకులో నికోటిన్ క్రియాశీల పదార్థం. ఈ డ్రగ్‌ను తీసుకున్న కొన్ని సెకన్లలోనే రక్తం ద్వారా మెదడుకు చేరుకుంటుంది. మానసిక స్థితి, ప్రవర్తనను మార్చే న్యూరోట్రాన్స్మిటర్లను విడుదల చేస్తుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇటీవలి పరిశోధనల ప్రకారం..టీనేజర్లు తోటివారి ఒత్తిడి వల్ల లేదా సిగరెట్ తాగినప్పుడు ఇతరులు పొందుతున్న మానసిక ప్రశాంతతను చూసి అడిక్ట్ అవుతారు. కొద్దిరోజులకు ధూమపానం వ్యసనంగా మారిపోతుంది. కొంతమంది మానాలని ఎంత ప్రయత్నించినా ఫలితముండదు. కాగా, అలాంటి వారికోసమే కొన్ని సహజ పద్ధతులను సూచించారు నిపుణులు. వీటిని పాటిస్తే పొగతాగాలనే ధ్యాస ఉండదని అంటున్నారు.
1.వీటిని నమలండి..
సిగరెట్ తాగాలనే కోరికను అధిగమించడానికి షుగర్‌లెస్ చూయింగ్ గమ్‌లు నమలాలి. క్యారెట్లు, దోసకాయలు లేదా నట్స్‌ను నములుతుంటే సిగరెట్ తాగాలన్న కోరిక కలుగదు.
2. ప్రతిరోజూ వర్కౌట్స్ చేయాలి..
ధూమపానం, పొగాకు నుంచి దృష్టి మరల్చే ఉత్తమ మార్గం వర్కౌట్స్. చెమటలు పట్టేట్లు వ్యాయామం చేయాలి. ఇంట్లో ఉంటే స్క్వాట్స్, నీ బెండింగ్, పుష్ అప్స్ లాంటి చిన్నచిన్న వ్యాయామాల్లో మునిగిపోవాలి. ఇంట్లో దుమ్ము దులపడం, తోటపనిలో మనసు లగ్నం చేయాలి.
3. ఆ ప్లేస్‌కు వెళ్లకండి..
మీకు ఎక్కడికెళితే సిగరెట్ తాగాలనిపిస్తుందో అక్కడికి వెళ్లకండి. పార్టీలు లేదా బార్లకు వెళ్లినప్పుడు సాధారణంగా చాలామందికి సిగరెట్ తాగాలనిపిస్తుంటుంది. వాటికి దూరంగా ఉంటే ఆ ఆలోచన రాదు. అలాగే, సిగరెట్ తాగే ఫ్రెండ్స్‌కు కొద్దిరోజులు దూరంగా ఉండండి. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ధ్యానం చేయండి. మీరు చేసే పనిలో నిమగ్నమైపోండి. సైన్స్ అలర్ట్ ప్రకారం, యూనివర్శిటీ కాలేజ్ (లండన్) పరిశోధకులు 12 వారాల వ్యవధిలో 96 మంది కొత్త అలవాట్లను పరిశీలించారు. 66 రోజులు చేస్తే కొత్త అలవాట్లు వచ్చేస్తాయని చెప్పారు. కనుక ఓ 66 రోజులు ధూమపానం మానేస్తే ఆ అలవాటు జీవితాంతం ఉండిపోతుంది. ఇక జన్మలో సిగరెట్ ముట్టరు.
4. రిలాక్స్ అవ్వండి..
చాలా మందికి, ధూమపానం విశ్రాంతికి ఒక మార్గం. అయితే, మీరు రిలాక్స్ అవ్వడానికి సంగీతం, పుస్తకం లేదా మసాజ్లాంటివి ఎంచుకోండి. ధూమపానం వల్ల విశ్రాంతి లభిస్తుందనేది అపోహే. ఇది మెదడులోని రసాయనాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
5. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపండి..
రోజంతా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపండి. వారితో ఆనందంగా మెదలండి. మంచి స్నేహం, సర్కిల్ ధూమపానం అలవాటును వదలివేయడంలో సహాయపడతాయి. ధూమపానం చేయని వారితో ఎక్కువ సమయం గడపండి, అప్పుడు సిగరెట్ తాగాలనే కోరిక కలుగదు.