Mustard Oil | మనకు ఉపయోగించేందుకు అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనలో చాలా మంది రీఫైన్ చేయబడిన నూనెలనే ఎక్కువగా వాడుతుంటారు. పూర్వకాలంలో మన పెద్దలు గానుగలో ఆడించిన నూనెలను వాడేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. 100 ఏళ్ల వరకు జీవించేవారు. ఇప్పుడు బిజీ యుగం కావడం వల్ల గానుగ నూనెలను తెచ్చి వాడేందుకు సమయం ఉండడం లేదని, ఇంకా పలు ఇతర కారణాల వల్ల రీఫైన్ ఆయిల్స్ నే ఎక్కువగా వాడుతున్నారు. అలాగే కొన్ని రకాల నూనెలను ఉపయోగించడమే మానేశారు. అలాంటి ఆయిల్స్ లో ఆవనూనె ఒకటి. ఆయుర్వేద పరంగా ఇది ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆవనూనెను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ నూనె మనకు ఎన్నో లాభాలను అందిస్తుందని అంటున్నారు.
ఆవనూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఇ కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇవి చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయి. దీంతో చర్మం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ కాంతి పెరుగుతుంది. చర్మం పొడిబారడం, పగలడం వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారి తేమగా ఉంటుంది. చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. జుట్టుకు కూడా ఆవనూనె ఎంతగానో పనిచేస్తుంది. ఇది జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. చుండ్రు నుంచి ఉపశమనం అందిస్తుంది. శిరోజాలు చిట్లిపోకుండా చేస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతుంది. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. సహజసిద్ధమైన మెరుపును సొంతం చేసుకుంటాయి.
ఆవనూనెను మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పులు, దృఢత్వం తగ్గుతాయి. కండరాల వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాల్లో ఉండే అసౌకర్యం తగ్గిపోతుంది. కండరాలు పట్టుకుపోయే వారు ఆవనూనెతో మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది. ఇది నొప్పులు, వాపులను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆవనూనెలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల చర్మానికి ఈ నూనెతో మసాజ్ చేస్తే దురద, దద్దుర్లు తగ్గుతాయి. చర్మం ఎరుపెక్కిన వారు ఈ నూనెను వాడితే ఫలితం ఉంటుంది.
ఆవనూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అందువల్ల ఆవనూనెను చర్మానికి రాస్తే గజ్జి, తామర వంటి చర్మ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఆవనూనెను శరీరానికి మర్దనా చేసి కాసేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా తరచూ ఈ నూనెను మర్దనా చేస్తుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఆవ నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, గుండెకు, మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇలా ఆవనూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.