న్యూఢిల్లీ : శరీరం ఆరోగ్యంగా ఉంటూ సరిగ్గా పనిచేయాలంటే పోషకాలు చాలా కీలకం. పోషకాల సమతుల్యం లేకుంటే పలు అనారోగ్యాలు వెంటాడుతుంటాయి. కీలక పోషకాల లేమితో బాధపడేవారికి మందులు, సప్లిమెంట్లతో లోపాలను సరిచేయవచ్చు. కేవలం మందులపైనే ఆధారపడకుండా మెరుగైన జీవన శైలి, ఆహారంతో పోషకాహార లేమిని అధిగమించవచ్చు. సాధారణంగా మనల్ని వెంటాడే పోషకాహార లోపాలు ఏంటో చూద్దాం.
ఐరన్ లోపం : శరీరంలో ఐరన్ లోపిస్తే ఎనీమియాతో పాటు శ్వాస అందకపోవడం, విపరీతమైన అలసట, జ్ఞాపక శక్తి సమస్యలు వెంటాడుతాయి. లివర్, బ్రకోలి, సీడ్స్ వంటి ఆహారంతో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.
విటమిన్ డీ లోపం : విటమిన్ డీ లోపంతో కుంగుబాటు, ఆకలి లేకపోవడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడంతో పాటు సాల్మన్ చేప, గుడ్లు, పోర్టిఫైడ్ సిరిల్స్ వంటి ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
క్యాల్షియం లోపం : క్యాల్షియం తగినంతగా లేకపోతే ఎముకలు, కండరాలు బలహీనమవుతాయి. పాలు, తోటకూర, ఆకుకూరలు, వెన్న వంటి ఆహార పదార్ధాలను తీసుకుంటే ఈ లోపాన్ని అదిగమించవచ్చు.
మెగ్నీషియం : మెగ్నీషియం లోపిస్తే అసాధారణంగా గుండె కొట్టుకోవడం, విపరీతమైన అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తాజా ఆకుకూరలు, డార్క్ చాక్లెట్లు, చిక్కుడు, బీన్స్, తృణ ధాన్యాలతో శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభిస్తుంది.
అయొడిన్ : అయొడిన్ లోపంతో జుట్టు ఊడిపోవడం, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయొడిన్ లోపంతో బాధపడేవారు గుడ్లు, పాలు, చికెన్, బీఫ్ లివర్, అయోడైజ్డ్ టేబుల్ సాల్ట్ వంటి ఆహార పదార్ధాలు తగినంతగా తీసుకోవాలి.