Monsoon Foods For Health | ప్రతి ఏడాదిలాగానే ఈ సారి కూడా వర్షాకాలం వచ్చేసింది. కానీ కాస్త ముందుగానే ఈ సీజన్ ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలకు అనువైన వాతావరణం ఉండడంతో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి. అయితే వర్షాకాలం వస్తూనే అనేక వ్యాధులను, ఇన్ఫెక్షన్లను తీసుకువస్తుంది. సీజనల్ వ్యాధులతోపాటు డెంగీ, మలేరియా వంటి జ్వరాలు కూడా ప్రబలేందుకు సిద్ధంగా ఉంటాయి. కనుక ఈ సీజన్లో మనం మన ఇమ్యూనిటీని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ అధికంగా ఉంటే సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతోపాటు జ్వరాలు వచ్చినా పెద్దగా నష్టం ఉండదు. త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఈ సీజన్లో మనం తినే ఆహారంపై కచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలని వారు చెబుతున్నారు.
వర్షాకాలంలో సూప్‌లు తాగేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. ముఖ్యంగా కూరగాయల సూప్ లేదా తేలికపాటి చికెన్ సూప్ ఆరోగ్యాన్నిస్తాయి. కూరగాయల సూప్‌లలో అనేక రకాలు ఉన్నాయి. టమాటా, గుమ్మడికాయ, క్యారెట్ లేదా మిక్స్డ్ వెజిటబుల్ సూప్‌లను తయారు చేసి తాగవచ్చు. ఇవి శరీరానికి కావల్సిన ద్రవాలను అందజేస్తాయి. సులభంగా జీర్ణం అవుతాయి. అనేక పోషకాలను అందిస్తాయి. సూప్‌లలో అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి వంటి వేసి తాగితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇవి వ్యాధులు రాకుండా చూస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడతాయి. వర్షాకాలంలో పప్పు దినుసులను అధికంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎర్ర కందిపప్పు, పెసలు తినాలి. ఇవి ప్రోటీన్లు, ఫైబర్ ను అందిస్తాయి. శరీరానికి శక్తి లభించేలా చేస్తాయి. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తాయి.
బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ, చిరు ధాన్యాలను వర్షాకాలంలో తప్పక తినాలి. ఇవి ఫైబర్ అందించడమే కాదు, బరువును నియంత్రణలో ఉంచుతాయి. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యలకు చెక్ పెడతాయి. వర్షాకాలంలో కిచిడీని ఆహారంలో భాగం చేసుకోవాలి. పెసలతో తయారు చేసే కిచిడీని తింటే ఎంతో మేలు చేస్తుంది. పోషకాలను అందిస్తుంది. జ్వరం, సీజనల్ వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. శరీరం యాక్టివ్‌గా ఉండేలా చూస్తుంది. ఈ సీజన్ లో రోజూ పసుపును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. పసుపు వేసి మరిగించిన నీళ్లను తాగుతున్నా లేదా రాత్రి పూట పాలలో పసుపు కలిపి తాగుతున్నా రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అల్లం రసం సేవిస్తున్నా కూడా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవచ్చు. భోజనానికి ముందు ఉదయం, సాయంత్రం తాగాల్సి ఉంటుంది.
వర్షాకాలంలో ఉదయం పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే శరీరం వెచ్చగా ఉండడమే కాదు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. నల్ల మిరియాలను ఈ సీజన్లో అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణను అందిస్తాయి. అలాగే దాల్చిన చెక్క వేసి మరిగించిన నీటిలో కాస్త తేనె కలిపి తాగుతున్నా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఈ నీళ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ ఉదయం పరగడుపునే నాలుగైదు తులసి ఆకులను నమిలి తింటుండాలి. లేదా రసం అయినా తాగవచ్చు. మెంతులను నీటిలో నానబెట్టి తింటుండాలి. లేదా మెంతులను వేసి మరిగించిన నీళ్లను తాగాలి. వేపాకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి. దీంతో వర్షాకాలంలో చర్మ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇలా ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిట్కాలను పాటించవచ్చు.