Memory Power | వయస్సు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుదల సాధారణంగా కనిపించే సమస్య. అయితే వృద్ధాప్యంతో వచ్చే జ్ఞాపకశక్తి తగ్గుదలను తిరిగి మెరుగుపరచడంలో గట్ మైక్రోబియోమ్ (మంచి బ్యాక్టీరియా) కీలక పాత్ర పోషించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా గట్ (జీర్ణ వ్యవస్థ) నుంచి మెదడుకు సంకేతాలు పంపే వెగస్ నర్వ్‌ను ఉత్తేజితం చేయడం ద్వారా ఈ ప్రభావం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వయస్సు పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలకు గట్‌లో పరిష్కారాలను కనుగొనే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. కొంతమంది వృద్ధులు ఎందుకు మానసికంగా చురుకుగా ఉంటారో, మరికొందరిలో 50-60 ఏళ్ల వయస్సు నుంచే జ్ఞాపకశక్తి తగ్గుదల ఎందుకు మొదలవుతుందో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు జరిగాయి. జ్ఞాపకశక్తి తగ్గుదల అనేది ముందే నిర్ణయించబడిన ప్రక్రియ కాదని, శరీరంలోని పలు వ్యవస్థలు దీనిని ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఈ ప్రక్రియలో కీలక నియంత్రకంగా పనిచేస్తుందని నిపుణులు వెల్లడించారు.
నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఎలుకలపై నిర్వహించారు. గట్‌లో సహజంగా నివసించే సూక్ష్మజీవుల సమూహమైన గట్ మైక్రోబియోమ్ వయస్సుతో మార్పులకు లోనవుతుందని పరిశోధకులు గుర్తించారు. కొన్ని బ్యాక్టీరియా జాతులు పెరగడం, మరికొన్ని తగ్గడం వల్ల ఈ మార్పులు జరుగుతాయి. ఈ మార్పులను గమనించే గట్‌లోని ఇమ్యూన్ కణాలు ఇన్ఫ్లమేటరీ ప్రతిస్పందనను ప్రారంభిస్తాయి. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల వెగస్ నర్వ్ పనితీరు దెబ్బతిని, మెదడులో జ్ఞాపకశక్తి, మార్గదర్శకతకు బాధ్యత వహించే హిప్పోకాంపస్‌కు సంకేతాలు సరిగా చేరవు. దీంతో జ్ఞాపకశక్తి తగ్గుదల కనిపిస్తుంది. పరిశోధనలో భాగంగా వృద్ధ ఎలుకలలో వెగస్ నర్వ్‌ను ఉత్తేజితం చేయగా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి. ముందుగా మరిచిపోయే లక్షణాలు ఉన్న ఎలుకలు, ఉత్తేజితం అయిన తర్వాత యువ ఎలుకల మాదిరిగా కొత్త వస్తువులను గుర్తించడం, మార్గాలను గుర్తించడం వంటి పనులను సులభంగా చేయగలిగాయి.
ఇంకా పరిశోధనలో, వృద్ధ ఎలుకల గట్‌లో పారాబాక్టీరోయిడ్స్ గోల్డ్స్టీనీ అనే బ్యాక్టీరియా పెరుగుదల కనిపించింది. ఈ బ్యాక్టీరియా జ్ఞాపకశక్తి తగ్గుదలతో నేరుగా సంబంధం ఉందని గుర్తించారు. ఈ బ్యాక్టీరియాను యువ ఎలుకల గట్‌లో ప్రవేశపెట్టగా, వాటి గుర్తింపు సామర్థ్యం తగ్గడం, మెజ్ పరీక్షల్లో పనితీరు దెబ్బతినడం గమనించారు. ఇది హిప్పోకాంపస్ కార్యకలాపం తగ్గడంతో అనుసంధానమై ఉంది. ఇక ఈ బ్యాక్టీరియా పెరుగుదలతో మీడియం-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనే మెటాబోలైట్లు కూడా పెరుగుతున్నాయి. ఇవి గట్‌లోని మైలోయిడ్ కణాలను ఉత్తేజితం చేసి ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. ఈ ఇన్ఫ్లమేషన్ వెగస్ నర్వ్ పనితీరును అడ్డుకుని, హిప్పోకాంపస్ కార్యకలాపాన్ని తగ్గించి, జ్ఞాపకశక్తి ఏర్పడే ప్రక్రియను దెబ్బతీస్తుందని పరిశోధకులు వివరించారు.
మరోవైపు, వెగస్ నర్వ్‌ను ఉత్తేజితం చేసే ప్రత్యేక మాలిక్యూల్‌ను వృద్ధ ఎలుకలకు ఇచ్చినప్పుడు, వాటి మానసిక పనితీరు యువ ఎలుకలతో సమానంగా మారిందని అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన ద్వారా గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మెదడు పనితీరును ప్రభావితం చేయవచ్చని స్పష్టమైంది. గట్ మైక్రోబియోమ్ను నియంత్రించడం, ముఖ్యంగా దాని మెటాబోలైట్లను సరిచేయడం ద్వారా జ్ఞాపకశక్తి తగ్గుదలను నియంత్రించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.